ఎర్ర సముద్ర ఉద్రిక్తతలు: ఇరాన్ వ్యూహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పా?
Red Sea సంక్షోభం: ఇరాన్ ప్రాక్సీ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తోంది?
“నిప్పు లేనిదే పొగ రాదు” అన్నట్లుగా, ఎర్ర సముద్రంలో హౌతీలు చేస్తున్న దాడుల వెనుక Iran హస్తం ఉందనేది అంతర్జాతీయ రాజకీయాల్లో బహిరంగ రహస్యం. ఇదే సమయంలో Strait of Hormuz సమీపంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతాన్ని కొత్త యుద్ధ అంచులకు నెడుతున్నాయి. ఈ పరిణామాలు మధ్యప్రాశ్చ్యంలో ఒక విస్తృత ఘర్షణకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఎర్ర సముద్ర మార్గంపై తీవ్రంగా పడుతోంది. ఆసియా–యూరప్ వాణిజ్యానికి కీలకమైన ఈ సముద్ర రవాణా మార్గం అస్థిరంగా మారితే, అది కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఇందులో ఇరాన్ పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కోబోయే ఆర్థిక-రాజకీయ ప్రభావాలు, ముఖ్యంగా ఐరోపాపై పడే ప్రభావమే ఈ ఎడిటోరియల్ లక్ష్యం.
ఆసియా–యూరప్ వాణిజ్యానికి జీవనాడి
ఆసియా–యూరప్ వాణిజ్యాన్ని కలిపే ప్రధాన సముద్ర మార్గం Red Sea – Suez Canal. UNCTAD (United Nations Conference on Trade and Development) గణాంకాల ప్రకారం ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12–15 శాతం సరుకులు, అంటే సంవత్సరానికి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం ఈ మార్గం గుండా సాగుతుంది.
గల్ఫ్ ప్రాంతం నుంచి యూరప్‌కు ప్రధానంగా చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, LNG సహజవాయువు సరఫరా అవుతాయి. రోజుకు సుమారు 8–9 మిలియన్ బ్యారెల్స్ ఇంధన ఉత్పత్తులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయని అంతర్జాతీయ ఇంధన గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో చైనా, భారత్, దక్షిణాసియా దేశాల నుంచి యూరప్‌కు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, దుస్తులు, ఫర్నిచర్, ఆహార పదార్థాలు, రసాయనాలు వంటి తయారీ సరుకులు చేరుతాయి. ఆసియా నుంచి యూరప్‌కు వెళ్లే కంటైనర్ సరుకుల విలువ మాత్రమే సంవత్సరానికి 600 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంతర్జాతీయ షిప్పింగ్ డేటా సూచిస్తోంది.
ఇక యూరప్ నుంచి ఆసియా దేశాలకు కూడా పెద్ద ఎత్తున యంత్రాలు, పరిశ్రమల పరికరాలు, ఆటోమొబైళ్లు, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, విమాన భాగాలు, అధునాతన సాంకేతిక ఉత్పత్తులు యూరప్ నుంచి భారత్, చైనా వంటి మార్కెట్లకు దిగుమతి అవుతుంటాయి. కేవలం European Union-India మధ్య వస్తువుల వాణిజ్యం మాత్రమే 2023లో €124 బిలియన్‌కు చేరిందని European Parliament గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల ఎర్ర సముద్ర మార్గంలో ఏర్పడే అంతరాయం కేవలం చమురు సరఫరాపై మాత్రమే కాదు— పరిశ్రమలు, వినియోగ మార్కెట్లు, ఆహార సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
Read this article also : ఇరాన్ సంక్షోభంలో భారత్ మౌనం: బలహీనతా?…వ్యూహాత్మక మౌనమా?
ఇక్కడ అంతరాయం కలిగితే
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కేవలం రాజకీయ అస్థిరతకే పరిమితం కావడం లేదు; అవి నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి.
Red Sea మరియు Suez Canal మార్గాల్లో భద్రతా సమస్యలు పెరగడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. United Nations Conference on Trade and Development (UNCTAD) గణాంకాల ప్రకారం, ఈ ప్రాంతంలో ప్రమాదాలు పెరగడంతో నౌకాయాన బీమా ప్రీమియంలు దాదాపు 400 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు $100 మార్కును దాటింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇది $120 దాటే ప్రమాదం ఉందని ఇంధన మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు, సహజవాయువు ధరల పెరుగుదల ప్రభావం కేవలం ఇంధన రంగానికే పరిమితం కాదు; ఎరువుల తయారీ ఖర్చులు పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగే ముప్పు పెరుగుతోంది.
ఈ సంక్షోభం ప్రపంచ సరఫరా గొలుసుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. International Monetary Fund (IMF) అంచనా ప్రకారం, ఈ ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావంతో 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎర్ర సముద్ర మార్గం ప్రమాదకరంగా మారడంతో సూయజ్ కాలువ గుండా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. అనేక నౌకలు ఆఫ్రికాలోని Cape of Good Hope మార్గం ఎంచుకోవాల్సి రావడంతో ప్రయాణ సమయం 10 నుంచి 15 రోజులు పెరుగుతోంది. దీనివల్ల కొన్ని మార్గాల్లో కంటైనర్ రవాణా ధరలు 300 నుంచి 500 శాతం వరకు పెరిగినట్లు షిప్పింగ్ రంగం చెబుతోంది. ఈ పరిణామాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “స్టాగ్ఫ్లేషన్” అనే ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read this article also : హెర్ముజ్ జలసంధి కాదు — నౌకలకు నరక ద్వారం
ఇరాన్ యుద్ధ తంత్రం: వ్యూహాత్మక దిగ్బంధనం
Iran వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే అది అనుసరిస్తున్న “ప్రాక్సీ యుద్ధ తంత్రం”ను పరిశీలించాలి. మధ్యప్రాచ్యంలో నేరుగా యుద్ధంలో దిగకుండా, తనకు అనుకూలమైన మిత్ర మిలిటెంట్ గ్రూపుల ద్వారా ప్రభావాన్ని విస్తరించడం ఇరాన్ ప్రధాన వ్యూహంగా మారింది. యెమెన్‌లోని హౌతీలు, లెబనాన్‌లోని Hezbollah, గాజాలోని Hamas, అలాగే ఇరాక్‌లోని షియా మిలీషియాలు కలిసి ఒక విస్తృత ప్రభావ వలయాన్ని సృష్టిస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఘర్షణ పెరిగితే, ఇతర ప్రాంతాల్లో ఈ మిత్ర శక్తులు ఒత్తిడి పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పాశ్చాత్య వ్యూహాత్మక విశ్లేషకులు ఈ కూటమిని “ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్”గా పేర్కొంటున్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా ఇరాన్ ఎర్ర సముద్రంలో నేరుగా యుద్ధంలో దిగకుండానే ప్రాంతీయ సమీకరణాలను ప్రభావితం చేయగలుగుతోంది.
ఇదే వ్యూహం సముద్ర మార్గాల నియంత్రణలో కూడా కనిపిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన రెండు జలసంధులు—Strait of Hormuz మరియు Bab-el-Mandeb Strait—ప్రస్తుతం అత్యంత సున్నిత ప్రాంతాలుగా మారాయి. మొదటి జలసంధిపై ఇరాన్ భౌగోళిక ప్రభావం ఉండగా, రెండవ దాని వద్ద యెమెన్ హౌతీలు ప్రాబల్యం చూపుతున్నారు. అంటే ప్రపంచ ఇంధన సరఫరా జరిగే రెండు కీలక ద్వారాలపైనా పరోక్షంగా ఒకే వ్యూహాత్మక ఒత్తిడి ఏర్పడినట్లే. ఈ మార్గాల్లో ఉద్రిక్తత పెరిగితే చమురు, వాణిజ్య నౌకల రాకపోకలు తీవ్రమైన అంతరాయాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఇరాన్ బలం సంప్రదాయ సైనిక శక్తిలో మాత్రమే కాదు; అది అనుసరిస్తున్న “అసమాన యుద్ధం”లో కూడా ఉంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు, సముద్రపు మైన్స్, వేగవంతమైన చిన్న పడవల దాడులు వంటి పద్ధతుల ద్వారా పెద్ద దేశాల నౌకాదళాలకు కూడా సవాలు విసురుతోంది. ఒకవైపు అగ్రరాజ్యాలు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంటే, మరోవైపు ఇరాన్ తక్కువ ఖర్చుతో భారీ అంతరాయం కలిగించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందుకే ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా, ప్రపంచ వాణిజ్యానికి దీర్ఘకాలిక భద్రతా సవాలుగా మారుతున్నాయి.
భారత్‌కు తప్పని సెగ
ఎర్ర సముద్ర మార్గంలో ప్రమాదాలు పెరగడంతో అనేక నౌకలు ఆఫ్రికా చుట్టూ ఉన్న Cape of Good Hope మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే సముద్ర ప్రయాణ సమయం 10 నుంచి 15 రోజులు పెరుగుతోంది. ఫలితంగా రవాణా ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతేకాదు, ఈ సుదీర్ఘ ప్రయాణంలో సముద్రపు దొంగల ముప్పు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వంటి అదనపు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.
భారత్‌కు ఇది మరింత ఆందోళన కలిగించే పరిణామం. యూరప్‌కు వెళ్లే భారత ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ సముద్ర మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, ఈ పరిస్థితి కొనసాగితే భారత ఎగుమతిదారులపై నెలకు దాదాపు ₹30 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.
Read this article also : గాలిలో దీపం — గల్ఫ్‌లో వలస జీవితం
చరిత్రలో చేదు జ్ఞాపకాలు: అమెరికా వ్యూహం విఫలమవుతుందా?
1967లో జరిగిన Six-Day War తర్వాత ఈజిప్ట్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో Suez Canalలో నౌకలు చిక్కుకుపోయి, భద్రతా కారణాల వల్ల కాలువ దాదాపు ఎనిమిదేళ్ల పాటు మూతపడిన సంఘటనను ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. అప్పట్లో ప్రపంచం ఎదుర్కొన్న ఆర్థిక మాంద్యం మళ్ళీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తన ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ ద్వారా రక్షణ కల్పిస్తున్నా, ఇరాన్ క్షిపణుల ముందు అవి ఎంతవరకు పనిచేస్తాయన్నది ప్రశ్నార్థకం. అమెరికా ప్రతి క్షిపణికి లక్షల డాలర్లు ఖర్చు చేస్తుంటే, ఇరాన్ కేవలం కొన్ని వేల డాలర్ల డ్రోన్లతో ఆ నష్టాన్ని కలిగిస్తోంది. “చిన్న ఆయుధంతో పెద్ద నష్టం కలిగించాలి” అన్న ఇరాన్ వ్యూహం ప్రస్తుతం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ యుద్ధం వెనుక ఉన్న రహస్య ఒప్పందాలు, వ్యూహాలు ఏవైనా కావచ్చు, కానీ నష్టపోయేది మాత్రం మానవాళి. ఇరాన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం వల్ల ఎర్ర సముద్రం ఇప్పుడు ఒక ‘డెడ్ జోన్’గా మారుతోంది.
ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోకపోతే, 2026 సంవత్సరం ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. శాంతి చర్చలు విఫలమైతే, ఎర్ర సముద్రం మరో యుద్ధ క్షత్రమే.
English Summary :
The growing tensions in the Red Sea are no longer just a regional security issue but a serious threat to global trade and economic stability. The Red Sea–Suez Canal corridor is one of the world’s most critical maritime routes, carrying about 12–15% of global trade every year. Energy supplies from the Gulf to Europe, along with manufactured goods from Asia to European markets, largely depend on this route. Rising attacks and security risks have already forced many shipping companies to reroute vessels around the Cape of Good Hope, increasing travel time and shipping costs while disrupting global supply chains.
At the center of the crisis is the strategic approach of Iran, which relies on proxy groups such as Yemen’s Houthis and other regional allies to exert pressure across key maritime choke points. This strategy, often described by analysts as part of the “Axis of Resistance,” allows Iran to influence regional dynamics without direct large-scale confrontation. The resulting instability threatens two crucial energy corridors—the Strait of Hormuz and the Bab-el-Mandeb Strait—raising concerns about long-term disruptions to global oil supplies and trade.
The economic consequences are already visible. Higher shipping insurance costs, rising oil prices, and delays in maritime transport are putting pressure on global markets. Countries like India, whose exports to Europe depend heavily on this route, may face rising logistics costs and reduced competitiveness. Unless international efforts succeed in stabilizing the region, the Red Sea crisis could evolve into a wider geopolitical and economic challenge with lasting consequences for the global economy.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
