ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘యూపీ దివస్ 2026’ (UP Diwas) వేడుకలు శనివారం (జనవరి 24) నుండి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
లక్నోలో కొత్తగా నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ (Rashtra Prerna Sthal) వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు.
‘వికసిత్ భారత్ – వికసిత్ ఉత్తరప్రదేశ్’ అనే ప్రధాన ఇతివృత్తంతో (Theme) జరుగుతున్న ఈ వేడుకలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా, ప్రజలందరూ భాగస్వాములయ్యే ఒక మహోత్సవంగా నిలవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రం సాధించిన అభివృద్ధిని మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఈవెంట్‌ను రూపొందించారు.
‘వన్ డిస్ట్రిక్ట్-వన్ క్యూజిన్’ ప్రధాన ఆకర్షణ
ఈ ఏడాది యూపీ దివస్ వేడుకల్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ క్యూజిన్’ (ODOC) పథకం. దీని కింద ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి జిల్లా నుండి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయక వంటకాన్ని ఎంపిక చేసి, వాటన్నింటినీ ఒకే చోట పర్యాటకులకు అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో పాటు ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ (ODOP) స్టాళ్లు, విదేశీ రాయబారుల భాగస్వామ్యం మరియు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి.
ముఖ్యమంత్రి యువ ఉద్యామి వికాస్ అభియాన్ (CM YUVA) కింద ఉత్తమంగా రాణించిన జిల్లాలకు మరియు ఐదుగురు ప్రముఖ వ్యక్తులకు ‘యూపీ గౌరవ్ సమ్మాన్ 2025-26’ పురస్కారాలను అమిత్ షా ఈ సందర్భంగా అందజేయనున్నారు.
ఢిల్లీ నుంచి ప్రపంచం దాకా సంబరాలు
లక్నోలో ప్రధాన వేడుకలు జరుగుతుండగా, నోయిడాలోని శిల్పగ్రామ్ మరియు ఢిల్లీలోని ‘ఢిల్లీ హాట్’లో కూడా యూపీ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఫిజీ, మారిషస్, సింగపూర్ వంటి 12 దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో విదేశాల్లో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం కూడా వేడుకలు ఏర్పాటు చేశారు. సర్దార్ పటేల్ ఇండస్ట్రియల్ జోన్ ప్రోగ్రామ్‌ను కూడా ఇదే వేదికపై హోం మంత్రి ప్రారంభించనున్నారు.
1950 జనవరి 24న ‘యునైటెడ్ ప్రావిన్సెస్’ నుండి ‘ఉత్తరప్రదేశ్’గా పేరు మారిన చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూ 2018 నుండి ఈ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.