
రష్యా డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి ఉలిక్కిపడింది. శనివారం రాత్రి వరుసగా రెండవ రోజు, శనివారం జరిగిన భారీ దాడికి కొనసాగింపుగా ఆదివారం తెల్లవారుఝామున కీవ్ పైన మళ్లీ బాంబుల వర్షం కురిసింది. ఆకాశంలో కొత్తగా శత్రుడ్రోన్లు ప్రవేశిస్తున్నాయని, కొన్ని ఇప్పటికే కూల్చేశామని, మరికొన్ని కీవ్ వైపు వస్తున్నాయని కీవ్ మిలిటరీ పరిపాలనాధికారి తిమూర్ ట్‌కాచెంకో పేర్కొన్నారు.
రష్యా తాజాగా నిర్వహించిన ఈ వైమానిక దాడుల్లో 14 బాలిస్టిక్ మిసైల్స్, 250 అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్టు ఉక్రెయిన్ వైమానిక దళాలు వెల్లడించాయి. వీటిలో ఆరు మిసైల్స్, 245 డ్రోన్లను నిర్వీయం చేశామని వెల్లడించారు. శనివారం-ఆదివారం మధ్య రాత్రి నుంచి ప్రారంభమైన ఈ దాడులు తీవ్ర ఆందోళన కలిగించాయని తెలిపారు. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పనిచేస్తోందని, కానీ ప్రతి ఒక్కరూ తక్షణమే బంకర్లలోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లలో జరిగిన అతి పెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా శనివారం 307 మంది రష్యా ఖైదీలను అదే సంఖ్యలో ఉక్రెయిన్ సైనికులతో మార్పిడి చేశారు. శుక్రవారం జరిగిన మొదటి విడతలో 270 మంది పౌరులు, సైనికులు పరస్పరం మార్పిడి అయ్యారు. ఈ పరిణామాల మధ్య, మాస్కో వర్గాలు ఉద్దేశపూర్వకంగా యుద్ధాన్ని దీర్ఘకాలంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.