
- మింటో రోడ్డులో మునిగిన కార్లు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకి సూచనలు
- పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం ఉదయం నుంచే ఒక వైపు భారీ వర్షం, మరోవైపు గాలులు నగరవాసులను వణికిస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఉదయం 6:50 గంటలకు ప్రయాణికుల కోసం హెచ్చరిక జారీ చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ సూచనలు పోస్టు చేశారు. గతరాత్రి ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయని, ప్రయాణీకులు తమ విమాన స్థితిని తరచూ చెక్ చేసుకోవాలని ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం మేము అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
మోటీబాగ్, మింటో రోడ్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1 పరిసరాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యింది. మింటో రోడ్‌లో ఓ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆకస్మిక గాలివానతో అక్బర్ రోడ్ వద్ద పలు చెట్లు కూలిపోవడంతో అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.
ధౌలా కువాన్ వద్ద ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనాల నెమ్మదిగా కదులుతున్నాయి. నానక్‌పురా అండర్‌పాస్‌లో నీరు చేరడంతో రాకపోకలపై ప్రభావం చూపింది. కేవలం ఢిల్లీనే కాకుండా, పొరుగున ఉన్న హర్యానాలోని ఝాజ్జర్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి.
శనివారం ముందుగానే భారత వాతావరణశాఖ (IMD) ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2–3 గంటల్లో భారీ వర్షాలు, పిడుగులు, 40–60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులన్నీ నమోదవుతాయని నౌకాస్ట్ హెచ్చరికలో వెల్లడించింది. పశ్చిమం/ఉత్తర పశ్చిమం వైపు నుంచి వస్తున్న తుఫాన్ క్లస్టర్ ఢిల్లీ మీదకు చేరుకుంటుందని తెలిపింది.
ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, బయట ఉండవద్దని, చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని, నీటి సమీపంలోనూ ఉండరాదని వాతావరణశాఖ సూచించింది. వృక్షాలు కూలిపోవడం, చెట్లు విరిగిపడే ప్రమాదం, అరటి, బొప్పాయి వంటి పంటలకు మోస్తరు నష్టం, బాగా పొడిగా ఉన్న చెట్టు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్లూ సంభవించొచ్చని హెచ్చరించింది.
ఇప్పటికే బుధవారం నాడు ఉత్తర ఢిల్లీపైకి భారీ మేఘసముదాయం చేరి, దక్షిణ దిశగా కదిలింది. దీంతో సాయంత్రం తేలికపాటి వర్షం, 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు, 70 కి.మీ. వేగంతో మోస్తరు తుఫాను నమోదయ్యాయి. పలుచోట్ల విద్యుత్ అంతరాయం నమోదయ్యింది.