September 20, 2026

పారదర్శక పంపిణీకి రేషన్ దుకాణాలే భరోసా: CDS మనోహర్

  • రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్‌ సరఫరా
  • రేషన్‌ మాఫియాపై కఠిన చర్యలు – పోర్టుల వద్ద భద్రత ముమ్మరం

విజయవాడ, జూన్ 1: రేషన్ పంపిణీలో పారదర్శకతకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపడుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ జరుగుతున్నాయని తెలిపారు.

రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా తమ డీలర్ వద్దే కాకుండా, రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని మంత్రి వివరించారు. శనివారం పిఠాపురం పట్టణంలోని చౌకధరల దుకాణంలో రేషన్ పంపిణీ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇళ్ల వద్దకే డెలివరీ – వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక సేవ
ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఆదివారాల్లో కూడా సరుకుల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరుకులు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వారి సంఖ్య 15.6 లక్షలుగా గుర్తించామని తెలిపారు. వారికి సరుకులు అందించేందుకు రేషన్ డీలర్లు బాధ్యత వహించనున్నారని, డెలివరీ అనంతరం వాట్సప్ గ్రూప్‌లో ఫోటో అప్‌లోడ్ చేయాలని డీలర్లకు సూచించామన్నారు.

మాఫియాపై ఉక్కుపాదం – భద్రత చర్యలు కఠినతరం
రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. కాకినాడ, విశాఖపట్నం పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం అక్రమ రవాణా కాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశామన్నారు. రైస్ స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. అలాగే నెల్లూరు తడ, కృష్ణపట్నం పోర్టుల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. ప్రభుత్వ ధ్యేయం పేదలకందాల్సిన బియ్యం వారికే అందేలా చూడడమేనని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీకు ఆసక్తి కలిగించే వార్తలు