March 10, 2026

పేదల రేషన్ హక్కులపై ఆటలెందుకు? – జగన్ 

  •  డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై జగన్ ఆగ్రహం
  • చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు


పేదల రేషన్ హక్కులకు మళ్లీ అడ్డంకులు ఏర్పడుతున్నాయంటూ, డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయడాన్ని ముదిరిన చర్యగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం మండిపడ్డారు. రేషన్‌ సరుకులను ఇంటికే తేవడంలో పారదర్శకతను తీసుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని, టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

డోర్ డెలివరీ సేవలు అందించిన 9,260 వాహనాలపై ఆధారపడిన 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉపాధిని కోల్పోయారని జగన్ చెప్పారు. ‘‘వారి కుటుంబాలను రోడ్డున పడేసే హక్కు చంద్రబాబుకెక్కడిదీ?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ వాహనాలు తుఫానులు, వరదల సమయంలోనూ ప్రజలకు అవసరమైన రేషన్ సరుకులు అందించాయనీ, అవసరమైన సేవల్ని సకాలంలో అందించాయనీ గుర్తు చేశారు.

రేషన్ సరుకుల పంపిణీలో గతంలో పేదలు ఎదుర్కొన్న అవమానాలను జగన్ వివరించారు. ‘‘రేషన్ దొరకకపోతుందేమోనన్న భయంతో ఎండలో, వానలో క్యూలలో నిలబడి పడిగాపులు పడేవారు. ఎప్పుడు వస్తుందో తెలియక పని మానేసి వేచి ఉండేవారు. అప్పట్లో సరైన తూకం ఉండేది కాదు, నాణ్యత కూడా ఉండేది కాదు. అప్పుడు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మేము ఈ వాహన విధానాన్ని తీసుకొచ్చాం. దాన్ని తొలగించి మళ్లీ పాత రోజులకు మళ్లటం ఎంతవరకు సమంజసం?’’ అని జగన్ ప్రశ్నించారు.

అంతేగాక, డోర్ డెలివరీ వాహనాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆయన విమర్శించారు. ‘‘సేవలు చేసిన వారిని స్మగ్లర్లు, మాఫియా ముఠాలుగా చిత్రీకరించడం చంద్రబాబుకు నల్ల చారగా మిగిలిపోతుంది,’’ అని జగన్ స్పష్టం చేశారు. దేశం గర్వపడే విధంగా ఉన్న ఈ డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం సాధించేది ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *