
మహారాష్ట్ర-రాజస్థాన్లో వేగంగా కేసులు
కరోనా కేసుల నమోదుతో దేశం మరోసారి గజగజలాడుతోంది. గతంలో ఎదుర్కొన్న మహమ్మారి మళ్లీ కాస్త రూపం మార్చుకుని విరుచుకుపడడానికి సిద్ధమవుతోంది. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదవుతున్న తాజా గణాంకాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పుతున్నాయి.
దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. శనివారం జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశలో ICMR, DGHS, NCDC, DHR వంటి కీలక ఆరోగ్య సంస్థల అధికారులు హాజరయ్యారు.
సమీక్షలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తించారు. అయితే, ఇవన్నీ తేలికపాటి లక్షణాలతో ఉంటూ, హోమ్ ఐసోలేషన్ ద్వారానే కోలుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఏదైనా ప్రమాదం తలెత్తినప్పుడు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ICMR, IDSP ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై ఇప్పటికే నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త వేరియంట్లు లేదా ప్రమాదకరమైన ధోరణులపై ఈ వ్యవస్థ బాగా పని చేస్తోందని వెల్లడించింది. సింగపూర్, హాంగ్‌కాంగ్ లాంటి దేశాల్లో ఇటీవల నమోదైన కేసులపై కూడా సమీక్ష జరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు ఎక్కువగా ప్రబలంగానీ, ప్రాణాంతకంగానీ లేవని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో శనివారం నాడు ఒక్కరోజే 47 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 4 మంది మరణించారు. చనిపోయినవారంతా ఇతర ఆరోగ్య సమస్యలు బాధితులేనని తెలుస్తోంది. ముంబైలోనే అత్యధికంగా 30 కేసులు, పుణె 7, థానే 6, నవి ముంబై 3, నాగ్‌పూర్‌లో ఒకటి నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 257 కేసులు, 87 రికవరీలు నమోదయ్యాయి.
మృతుల్లో థానేకి చెందిన 21 ఏళ్ల యువకుడు, 70 ఏళ్ల గుండె రోగి, ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, ఒక 59 ఏళ్ల క్యాన్సర్ బాధితురాలు ఉన్నారు. రాజస్థాన్లో కూడా రెండు రోజుల్లో 6 కొత్త కేసులు వెలుగుచూశాయి. జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. జైపూర్ ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో మరో ఇద్దరికి వైరస్ సోకింది.
JN.1 వేరియంట్‌పై సస్పెన్స్
ఈ కేసులపై జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఇవి ఒమిక్రాన్ వేరియంట్ JN.1 వల్ల వచ్చాయా? లేదా? అన్నదానిపై స్పష్టత వచ్చేలా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత బలపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం చూపబోమని స్పష్టం చేసింది.