April 12, 2026

జాబ్ క్యాలెండర్‌పై వైఎస్ఆర్ సీపీ నిప్పులు

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబ్ క్యాలెండర్‌పై వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది నిరుద్యోగుల ఆశలను నెరవేర్చే క్యాలెండర్ కాదని, వారిని నిలువునా వంచించే “దగా క్యాలెండర్” అని ఆయన అభివర్ణించారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను అబద్ధపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో 2024 మార్చి నాటికి రాష్ట్రంలో 11.79 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10.07 లక్షలకు పడిపోయిందని హర్షిత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. కేవలం 22 నెలల కాలంలోనే 1.72 లక్షల ఉద్యోగాలను ఈ ప్రభుత్వం ఊడబెరికిందని ఆయన ఆరోపించారు. పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా దాచిపెట్టి, కేవలం 10,060 పోస్టులతో కంటితుడుపు చర్యగా క్యాలెండర్ విడుదల చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

న్యాయం అడిగితే బేడీలా?: కార్మికులు ఈ వార్తను కూడా చదవండి

ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000ల భృతి ఇస్తామని చెప్పి, రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని హర్షిత్ రెడ్డి విమర్శించారు. ఆ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ప్రభుత్వం సుమారు రూ.21,600 కోట్లు బకాయి పడిందని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి లక్షలాది మంది యువత కడుపు కొట్టారని, నెలకు పదివేల వేతనం ఇస్తామని నమ్మబలికి వారిని నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోం శాఖలో 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ కార్యాలయం నివేదిక ఇచ్చినా, జాబ్ క్యాలెండర్‌లో కేవలం 2,778 పోస్టులనే చూపడం వెనుక అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. గతంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రచారం చేసిన నారా లోకేష్, ఇప్పుడు మంత్రిగా కేవలం 3,004 పోస్టులనే ప్రకటించడం యువతను మోసం చేయడమేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకుని, అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను పారదర్శకంగా బయటపెట్టాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసంబద్ధమైన జాబ్ క్యాలెండర్‌ను సవరించి, అర్హులైన నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని కోరారు. అలాగే రెండేళ్ల బకాయిలతో సహా నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

APJobCalendar #HarshithReddy #YSRCP #Unemployment #NaraLokesh #APPolitics #JobScam #YouthProtest

న్యాయం అడిగితే బేడీలా?: కార్మికులు ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *