March 25, 2026

ఆదోనీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా – 91 లక్షల నగదు స్వాధీనం


  • యువతను లక్ష్యంగా చేసుకున్న బెట్టింగ్ ముఠాలు
  • ఎస్పీ హెచ్చరిక – బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

క్రికెట్ అంటే క్రీడ మాత్రమే కాదు – ఇప్పుడు అది యువత ఆశలతో ఆడుతున్న ఓ ప్రమాదకర ఆటగా మారింది. కర్నూలు జిల్లాలోని ఆదోనీలో అంతరాష్ట్ర స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యువతను టార్గెట్ చేస్తూ, ఇంటర్నెట్, మొబైల్ యాప్‌ల సహాయంతో ఈ ముఠా భారీగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తూ పోలీసులు కన్నుల్లో పడింది.

శనివారం జరిగిన తనిఖీల్లో ఆదోనీ పోలీసులు ఏడుగురు సభ్యులతో కూడిన క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.91 లక్షల నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు.

యాప్‌ల వలలో చిక్కుతున్న యువత – ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు

ఈ ముఠా సభ్యులు వివిధ బెట్టింగ్ యాప్‌ల ద్వారా యువతను ప్రలోభాలకు గురిచేస్తూ బెట్టింగ్‌లో లాగుతున్నారు. ‘అధిక లాభాలు వస్తాయి’ అనే మాయమాటలతో వందలు, వేల రూపాయలు కాదు – లక్షల రూపాయల వరకు అప్పులు తీసుకొని యువత బెట్టింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. పలువురు మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే దాకా వెళ్తున్నారు.

ఈ ముఠాపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, చివరికి వారిని పట్టుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ – “బెట్టింగ్ వల్ల లాభం ముఠా నిర్వాహకులకే ఉంటుంది. సామాన్య ప్రజలు మాత్రం మోసపోతున్నారు. క్రికెట్ బుకీలు డబ్బు ఆశ చూపి యువతను బెట్టింగ్‌లోకి లాగుతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *