వికేంద్రీకరణ వైపు వేగంగా పరుగులు తీస్తున్న తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలనిఅనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రాజెక్టులకు త్వరిత ఆమోదాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు, మెట్రో నుంచి రక్షణ పరిశ్రమల వరకూ… అనేక అంశాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అనేక ప్రాజెక్టులపై ప్రధాని వివరించి, వెంటనే మంత్రివర్గ ఆమోదాలు, ఆర్థిక మంజూరులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2
ఇప్పటికే 69 కిలోమీటర్ల మేర అమలు చేసిన మెట్రో ఫేజ్-1 తర్వాత, నగర అభివృద్ధికి అనుగుణంగా మెట్రో విస్తరణ అత్యవసరంగా మారిందని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో పదేళ్లుగా విస్తరణ చేపట్టకపోవడంతో ఈ ప్రాజెక్టు వాయిదా పడిందని,ప్రస్తుతం ప్రతిపాదించిన ఫేజ్-2లో ఐదు కారిడార్లుగా 76.4 కిలోమీటర్ల విస్తరణ చేయనున్నామన్నారు. దీని ఖర్చు రూ. 24,269 కోట్లు కాగా, కేంద్ర వాటా 18 శాతం (రూ. 4,230 కోట్లు), రాష్ట్ర వాటా 30 శాతం (రూ. 7,313 కోట్లు)గా పేర్కొన్నారు. నవంబర్ 2024లోనే ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ (MoHUA) ఇప్పటివరకు కొన్ని స్పష్టతలు మాత్రమే కోరిందని తెలిపారు. చెన్నై, బెంగళూరు మెట్రోలకు ఇప్పటికే ఆమోదాలిచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కూడా వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు.
రీజినల్ రింగ్ రోడ్ (RRR), రీజినల్ రింగ్ రైల్వేకు వెంటనే ఆమోదాలు ఇవ్వండి
హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసం రెండు జాతీయ రహదారులు ఏర్పాటు చేయాలని రాష్ట్రం సూచించిందన్నారు. ఇప్పటికే ఉత్తర భాగంలో భూ సేకరణ ప్రారంభమై 90 శాతం భూముల వివరాలను నేషనల్ హైవేస్ అథారిటీకి (NHAI) పంపినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వంటి రంగాల వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని RRRకు ఆలస్యం చేయకుండా ఆమోదం ఇవ్వాలని కోరారు.
పారిశ్రామిక, రవాణా ప్రాధాన్యత కలిగిన బందర్ పోర్ట్ హైవే
ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ సమీపంలో ప్రతిపాదిత డ్రై పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం మద్దతు అవసరమన్నారు. ఇది సరుకు రవాణా ఖర్చులను తగ్గించడంతో పాటు, ఫార్మా రంగంలోని తెలంగాణ ఆధిక్యాన్ని మరింత ప్రోత్సహించబోతుందని చెప్పారు. రహదారికి సమాంతరంగా రైలు మార్గం అభివృద్ధికి కూడా కేంద్రం ఆమోదం ఇవ్వాలని విన్నవించారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో తెలంగాణకు స్థానం కల్పించండి
సెమీకండక్టర్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ISMలో రాష్ట్రానికి స్థానం కల్పించాలని ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ తయారీ సంస్థలు ఈ రంగానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. 2030 నాటికి దేశం లక్ష్యంగా పెట్టుకున్న 500 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో తెలంగాణ కీలక పాత్ర పోషించగలదని చెప్పారు.
డిఫెన్స్ జాయింట్ వెంచర్లకు ప్రత్యేక ఆమోద మార్గం కావాలి
రాష్ట్రంలో వృద్ధిచెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు కేంద్రం నుంచి స్పష్టమైన మద్దతు అవసరమన్నారు. హైదరాబాద్‌లో 1,000కి పైగా MSMEs గ్లోబల్, నేషనల్ డిఫెన్స్ సంస్థలకు సేవలందిస్తున్నాయని, హై రిస్క్ – హై రివార్డ్ రంగమైన డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు ఉత్సాహవంతమైన పథకాలు అవసరమన్నారు. హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌గా అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.