April 17, 2026

ఏడుపు ఆపలేదనీ… 5 నెలల పసిబిడ్డను చంపి… కన్న తల్లే.. ఆ కసాయి!

తల్లి ఒడిలో భద్రంగా ఉండాల్సిన ఐదు నెలల పసిబిడ్డ… అదే తల్లి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఏడుపు ఆపడం లేదన్న కోపంతో కన్నతల్లే నోరు-ముక్కు మూసేయడంతో పసికందు ఊపిరాడక మృతి చెందిన హృదయ విదారక ఘటన NR Agraharamలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహరంలో నివసిస్తున్న వెంకటేష్, హేమావతికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల కొడుకు, ఐదు నెలల కూతురు ఉన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా హేమావతి తరచూ ఒత్తిడిలో ఉండేదని సమాచారం.

ఈ క్రమంలో ఐదు నెలల పాప తరచూ ఏడుస్తుండేది. ఎంత సముదాయించినా ఏడుపు ఆగకపోవడంతో హేమావతి కోపం అదుపు కోల్పోయింది. ఏడుపు ఆపాలనే ఉద్దేశంతో పసిబిడ్డ నోరు, ముక్కును చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుంది. కొద్ది సేపటికే పాప స్పందించకపోవడంతో ఆమె భయపడింది. అప్పటికే చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది.

read this article also: Markapuram Bus Accident: ప్రకాశం జిల్లాలో 14 మంది సజీవదహనం

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తల్లి హేమావతిని అదుపులోకి తీసుకుని విచారించగా… ఏడుపు ఆపడం లేదన్న కోపంతో ఇలా చేసినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి ఒడిలో సురక్షితంగా ఉండాల్సిన పసిబిడ్డ… అదే తల్లి చేతిలో మృతి చెందడం గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి కారణంగా ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1 thought on “ఏడుపు ఆపలేదనీ… 5 నెలల పసిబిడ్డను చంపి… కన్న తల్లే.. ఆ కసాయి!

  1. తల్లే పిల్లాడి ఏడుపు భరించలేక పోతే ఎలా? ఎటు పోతుంది ఈ లోకం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *