March 26, 2026

జనసేన – టిడిపి ల మధ్య చిచ్చురేపిన దీపావళీ..

కాకినాడ అక్టోబర్ 28 : కాకినాడలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది.. కీలకమైన పోస్టింగుల వ్యవహారం నుంచి బ్రాందీ షాపుల ఏర్పాటు వరకు నిత్యం వార్తల్లో నిలుస్తోన్న టిడిపి జనసేన ప్రజాప్రతినిధులు మధ్య వైరం తాజాగా దీపావళీ బాణాసంచా దుకాణాల ఏర్పాటులోనూ కొనసాగింది..

దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాల విషయంలో కాకినాడ ఎంపీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదం రేగింది. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుకు నిరసనగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) అనుచరులు రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఈ నిరసనలను ఎమ్మెల్యే అనుచరులు చేపట్టారు.

దీపావళి బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో తమ వారికి రాకుండా ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, ఆయన అనుచరులు అడ్డుకున్నారని నినాదాలు చేశారు. అంతేకాకుండా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ నేత, సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నులలో పనిచేస్తున్నారంటూ విమర్శించారు. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న నాన్ స్టాప్ బస్సును కొంతసేపు టీడీపీ శ్రేణులు అడ్డగించడంతో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు.

ఈ వ్యవహారంపై కాకినాడ ఆర్డిఓ ఎస్ మల్లిబాబును వివరణ కోరగా కాకినాడ పరిధిలో 128 దుకాణాలకు గాను 127 దుకాణాలకు కేటాయింపులు జరిగాయని వాటిలో ఒక్కదానికి మాత్రమే నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అనుమతులు ఆపమన్నారు.

ఆ దుకాణం కాకినాడ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య, ఇరువైపులా దుకాణాలు ఉండటంతో అనుమతిని ఆపామన్నారు. కాకినాడ ఎంపీపై ఎమ్మెల్యే అనుచరులు విమర్శలు చేస్తూ ఆందోళణ చేపట్టడం నగరం చర్చనీయాంశంగా మారింది.. మరోవైపు కూటమి నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయన్న వాదన వినిపిస్తోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *