March 24, 2026

చినాబ్ రైల్వే వంతెన వెనుక తెలుగు ప్రొఫెసర్ మాధవీలత రెడ్డి కృషి

ఒంగోలు : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు మహిళ గాలి మాధవీలత రెడ్డి కీలక పాత్ర పోషించారు. 17 సంవత్సరాల పాటు నిరంతరంగా కన్సల్టెంట్‌గా సేవలందించిన మాధవీ, ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి ముఖ్యమైన శాస్త్రీయ పునాది వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐఐఎస్‌సీ బెంగళూరు లో Geotechnical Engineering ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, Rock Mechanics రంగంలో ఆమె పరిశోధనలు ఈ వంతెన నిర్మాణంలో కీలకంగా నిలిచాయి.

చినాబ్ వంతెన భారతదేశంలోనే కాక, ప్రపంచంలో కూడా అద్భుత ఇంజినీరింగ్ చరిత్రగా నిలిచింది. ఇది ఐఫిల్ టవర్ కంటే ఎత్తు కలిగిన వంతెనగా గుర్తింపు పొందింది. జమ్మూ-శ్రీనగర్ మధ్య భద్రతా అవసరాల కోసం నిర్మించిన ఈ వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మైలురాయి వెనుక మాధవీలత బృందం కృషి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు.

మాధవీలత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందినవారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, చదువులోనూ, పరిశోధనల్లోనూ ప్రత్యేకంగా రాణించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకటరెడ్డి. భర్త హరిప్రసాద్ రెడ్డి బాపట్ల జిల్లా మైదుకూరు వాసి. చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలని కలలు కన్న మాధవీ, అనంతర పరిస్థితుల నేపథ్యంలో బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) చేసారు. అక్కడినుంచి పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగి ఐఐటీ మద్రాస్ లో పీహెచ్.డి పూర్తిచేశారు.

తరువాత ఐఐటీ గౌహతి లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన మాధవీ, 2003లో ఐఐఎస్‌సీ బెంగళూరు లో చేరారు. అక్కడే ఆమె చినాబ్ బ్రిడ్జి ప్రాజెక్ట్ లోకి ప్రవేశించారు. రాక్ మెకానిక్స్‌పై ఆమెకు ఉన్న లోతైన విజ్ఞానం ప్రాజెక్ట్ కి కీలకంగా మారింది. శిలల స్థితి, బరువు, కదలికలపై ఆమె చేసిన అధ్యయనమే వంతెన నిర్మాణానికి శాస్త్రీయ పునాది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *