
- జూన్ వరకూ ఎన్నికల కోసం ఎదురుచూడలేమన్న ఆర్మీ చీఫ్ జమాన్
బాంగ్లాదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. రోజురోజుకు రాజకీయ వాతావరణం మారిపోతోంది. తాత్కాలిక ప్రధాన సలహాదారుడిగా ఉన్న మొహమ్మద్ యునస్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ పావులు కదుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ కోసం జూన్ వరకూ వేచి ఉండే పరిస్థితి లేదనే ఆయన సంకేతాలు, దేశ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.
రాజకీయ పరిణామాల్లో సైనిక ముద్ర
సాధారణంగా అయితే పాలనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రజాప్రతినిధుల వ్యవస్థ లేని సమయంలో అధికారులు మాత్రమే సమావేశాలను నిర్వహిస్తారు. కానీ, ఇప్పటికే పలు ప్రభుత్వ అధికారుల సమావేశాలకు సైన్యం హాజరవుతూ వస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం నమ్మకం సన్నగిల్లడతో సైన్యం నేరుగా సమావేశాలకు హాజరై తమ ప్రభావాన్ని చాటుకుంటోంది. జమాన్ స్వయంగా కొన్ని సామూహిక వేదికలపై యునుసు తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. దీంతోనే ఆర్మీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలుస్తోంది.
జమాన్ తాత్కాలిక ప్రభుత్వ చట్టబద్ధతపై ప్రశ్నలు ఎత్తిపొడుస్తూ, బాంగ్లాదేశ్ రాజ్యాంగంలోని సెక్షన్లను ఉపయోగించుకునే మార్గాలపై పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక ప్రభుత్వాన్ని రద్దు చేసిన 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనను ఆయుధంగా మలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి యూనస్ పదవిలో కూర్చోని 9 నెలలు కావస్తోంది. అంటే మూడు నెలలు కాస్తా 9 నెలలు అయ్యింది. ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది.
హసీనా – ఖలేదా పార్టీలను కలిపే వ్యూహం?
సైన్యం, యునుసును అధికారం నుంచి తొలగించగలిగితే, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మరియు ఖలేదా జియా నేతృత్వంలోని బీఎన్పీ పార్టీలను బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఆ ప్రయత్నాలు విఫలమైతే, తాత్కాలికంగా రాజకీయ నియంత్రణను సైన్యం స్వీకరించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగం Article 58 ప్రస్తావన- అత్యవసర స్థితి
బాంగ్లాదేశ్ రాష్ట్రపతి మహ్మద్ షహాబుద్దీన్‌ను ఆర్మీ Article 58 ప్రకారం అత్యవసర పరిస్థితిని ప్రకటించమంటూ ఒత్తిడి తెస్తోంది. ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలు వినియోగించవచ్చు. ఇది యునుసు ప్రభుత్వాన్ని బైపాస్ చేసి, ఎన్నికల ప్రక్రియను ముందుకు తెచ్చే దిశగా కీలక అడుగు అవుతుంది.
రాఖైన్ కారిడార్ ప్రాజెక్టు, విదేశీ ప్రమేయాన్ని పెంచే విధానాలు, యునుసు ప్రవేశపెడుతున్న ప్రతిపాదనలను జమాన్ సూటిగా విమర్శించారు. జాతీయ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జమాన్ ఇప్పటికే నౌకాదళం, వైమానిక దళాధిపతుల మద్దతు పొంది, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మద్దతుతో ఆయన రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నారు. త్వరితగతిన ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బాంగ్లాదేశ్‌లో గతంలోనూ సైనిక పాలనలు చోటుచేసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను మళ్లీ సైన్యం చెరబడుతుందా? లేక రాజ్యాంగ పరిమితుల్లోనే పరిష్కారం దొరుకుతుందా? అన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న అంశం.