ద్వారంపూడి పై విమర్శలు తగవు
టీడీపీపై వైఎస్ఆర్సీపీ మండిపాటు
కాకినాడ : (అక్టోబర్ 28) బాణా సంచా దుకాణాల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశం నేతలు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ అధికారులు ద్వారంపూడి మాటే వింటున్నారంటూ టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆర్డీవో కార్యాలయంఎదుట రోడ్డుపై నిరసన తెలియజేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
దీపావళి సందర్భంగా బాణా సంచా దుకాణాలు కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. గతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలోనే డ్రా తీసి దుకాణాలు కేటాయించేవారని విద్యాసాగర్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త సంస్కృతికి తెరలేపి ఓ లాడ్జిలో డ్రా తీసి నచ్చిన వారికి దుకాణాలు కేటాయించుకుంటున్నారని మండిపడ్డారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ద్వారంపూడి కానీ, వైఎస్సార్సీపీ కానీ దుకాణాల కేటాయింపుపై అధికారులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
తమ అక్రమాలు బయటపడతాయనే భయంతో ద్వారంపూడిని వివాదంలోకి లాగి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి అంశాన్ని ద్వారంపూడి తో ముడి పెట్టడం టిడిపికి అలవాటుగా మారిందన్నారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తూ ప్రజల ప్రాణాలతో టీడీపీ నేతలు చెలగాటం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.