
గువాహటి: ఇండోర్ జంటకు సంబంధించిన రాజా రఘువంశీ హత్య కేసును కేవలం 7 రోజుల్లోనే ఛేదించిన మేఘాలయ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రెస్టన్ తైన్సాంగ్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, “ఇది మేఘాలయ పోలీసుల సమర్థతకు నిదర్శనం. దేశంలోనే ఉత్తమ పోలీస్ బలగాల్లో ఒకటిగా మేఘాలయ పోలీసుల పేరు నిలిచింది” అన్నారు.
ఈ కేసులో రాజా భార్య సోనంను పోలీసులు అరెస్ట్ చేయడంతో మృతుని తల్లి ఉమా రఘువంశీ స్పందిస్తూ “ఈ కేసును చేధించిన మేఘాలయ పోలీసులకు, కఠిన వాతావరణం మధ్యలో కూడ వెతికిన సర్చ్ టీంలకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాజాను ఎవరు చంపారో తెలియకుండానే ఉండిపోయేవారేమో” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
డిప్యూటీ సీఎం తైన్సాంగ్ మాట్లాడుతూ, “ఈ ఘటన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మేఘాలయను నేరస్థుల అడ్డాగా చిత్రీకరించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. కానీ వాస్తవానికి మేఘాలయ టూరిస్టులకు చాలా సురక్షిత ప్రాంతం,” అని స్పష్టం చేశారు. “ఈ విజయవంతమైన ఆపరేషన్ రాష్ట్రానికి మళ్లీ పర్యాటకుల విశ్వాసాన్ని తీసుకొస్తుంది,” అని తెలిపారు.
“15–20 ఏళ్ల క్రితం మిలిటెన్సీని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నామో అందరికీ గుర్తు ఉంటుంది. కేంద్ర బలగాలు అవసరం లేదు,” అని తైన్సాంగ్ వ్యాఖ్యానించారు. “హోటల్స్, హోం స్టేల యజమానులు టూరిస్టుల రిజిస్ట్రేషన్ నిర్బంధంగా చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా టూరిజం యాప్ కూడా రూపొందించాం” అని తెలిపారు.
పర్యాటక శాఖ మంత్రి పాల్ లింగ్డోః మాట్లాడుతూ, పర్యాటకుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక పరిశ్రమతో కలిసి పనిచేస్తోంది అన్నారు. ఇక పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి రెండు సంవత్సరాల్లో రూ. 4,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా సోహ్రా (Sohra), ఉమియాం (Umiam) వంటి పర్యాటక ప్రాంతాల్లో హై-ఎండ్ accommodation నిర్మాణం చేపడతామని వెల్లడించారు.