March 19, 2026

ఉపాధి హామీపై మోదీ కుట్ర.. పేదల పొట్ట కొట్టడమే లక్ష్యం: షర్మిల

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేదల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప ఆశయమని, అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు.

అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన ‘ఉపాధి పరిరక్షణ యాత్ర’ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం వైఎస్సార్ ఆశయాల నుంచి పుట్టినదని, దీనిని కాంట్రాక్టర్ల జేబులు నింపే ‘గ్రామ్ జి’ (GRAM-G) చట్టంగా మార్చడం పేద ప్రజలకు తీరని అన్యాయమని ధ్వజమెత్తారు.

పేదల హక్కును కాలరాస్తున్న ‘జి రామ్ జి’ చట్టం.. గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం

ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును తొలగించడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఆనాడు గాడ్సే గాంధీని చంపితే, ఈనాడు పథకం నుంచి పేరు తొలగించి మోదీ మరోసారి గాంధీని చంపారని విమర్శించారు. మన్రేగా చట్టం ప్రకారం పని అడగడం కూలీల హక్కు అని, కానీ కొత్తగా తెచ్చిన చట్టంలో ఆ హక్కును కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామసభలు నిర్ణయించే పనులను ఇప్పుడు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు నిర్ణయిస్తారని, ఇది కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనని ఆమె ఆరోపించారు. సుమారు రూ.80 వేల కోట్ల నిధులను పేదల నుంచి మళ్లించి కాంట్రాక్టర్ల జేబుల్లో పోయడానికి కేంద్రం సిద్ధమైందని విమర్శించారు.

సంవత్సరానికి సగటున 52 రోజులు కూడా పని కల్పించలేని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 125 రోజులు పని కల్పిస్తామనడం పచ్చి అబద్ధమని షర్మిల కొట్టిపారేశారు. ఈ పథకానికి గతంలో కేంద్రమే 100 శాతం నిధులు ఇచ్చేదని, కానీ ఇప్పుడు 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి అప్పుల రాష్ట్రానికి ఇది పెద్ద గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బాబు, జగన్ మోదీకి బానిసలు.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ మోదీకి భయపడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంపై అదనపు భారం పడుతున్నా, పేదల పొట్ట కొడుతున్నా ఎవరూ నోరు విప్పడం లేదని విమర్శించారు. వైఎస్సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలబడుతుందని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. పేద కుటుంబాలు మళ్లీ వలసల బాట పట్టకుండా ఉండాలంటే ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేసే ఉద్యమానికి మద్దతు పలకాలని ఆమె కోరారు.

#YSSharmila #MGNREGA #Congress #SaveEmployment #AndhraPradesh #YSR #ModiSarkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *