March 24, 2026

వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యత

  •  నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంతరించిపోతున్న అడవి జాతులు, వృక్షజాలంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. 2013లో ఐక్యరాజ్యసమితి తీసుకున్న తీర్మానం ప్రకారం, పర్యావరణ సమతుల్యతలో వన్యప్రాణుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి మనుగడకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి. మనిషి కంటే ముందే భూమిపై ఆవిర్భవించిన జంతుజాలం, నేడు స్మగ్లర్లు, వేటగాళ్లు మరియు పారిశ్రామికీకరణ కారణంగా అంతరించిపోయే దశకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఈ దినోత్సవం గుర్తు చేస్తోంది.

చారిత్రక నేపథ్యం మరియు చట్టబద్ధమైన రక్షణ

భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1898లోనే తమిళనాడులోని వేదాంతంగల్‌లో మొదటి పక్షుల అభయారణ్యం ఏర్పాటైంది. ఆ తర్వాత 1935లో జిమ్ కార్బెట్ (హేలీ) నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకువచ్చిన ‘వన్యప్రాణుల సంరక్షణ చట్టం’ దేశంలో వేటను నిషేధించడమే కాకుండా, అడవి జంతువుల రక్షణకు బలమైన పునాది వేసింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఎ) ప్రకారం అడవులను, వన్యప్రాణులను రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా గుర్తించబడింది.

పులుల సంరక్షణలో భారత్ అగ్రగామి

ప్రపంచంలోని మొత్తం పులుల జనాభాలో 70 శాతానికి పైగా భారతదేశంలోనే ఉండటం మనకు గర్వకారణం. 1972లో కేవలం 1800 చిల్లరగా ఉన్న పులుల సంఖ్య, నిరంతర కృషి వల్ల 2018 గణాంకాల ప్రకారం 2967కు చేరింది. పులుల గణనలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB) ఆవిష్కరించిన ఆధునిక పద్ధతులు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 441 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 28కి పైగా టైగర్ జోన్లు పులుల సంతతిని పెంచేందుకు కృషి చేస్తున్నాయి.

మనుగడకు ముప్పు – మానవ జోక్యం

అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, విచక్షణా రహితంగా అడవులను నరకడం వల్ల వన్యప్రాణుల సహజ ఆవాసాలు ధ్వంసమవుతున్నాయి. ఆహారం, నీటి కోసం జంతువులు జనారణ్యంలోకి రావడం వల్ల మానవ-మృగ సంఘర్షణలు పెరుగుతున్నాయి. స్మగ్లర్ల ధాటికి పులులు, చిరుతలు తమ ప్రాణాలను కోల్పోతున్నాయి. పర్యావరణ చక్రం దెబ్బతినకుండా ఉండాలంటే వన్యప్రాణులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం అత్యవసరం. కేవలం చట్టాలు మాత్రమే కాకుండా, అడవి జంతువుల పట్ల మానవీయ దృక్పథం పెరిగినప్పుడే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుంది.

#WorldWildlife Day #WildlifeConservation #SaveTigers #NatureProtection #IndianForests #EcoSystem #WildlifeAwareness #SaveAnimals #March3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *