విజయనగరం పాలిటెక్నిక్ కళాశాలకు మహర్దశ..
రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయనగరంలోని ఎంఆర్ విజిఆర్ (MRVGR) పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అదనపు భవనాల నిర్మాణానికి వచ్చే ఏడాది శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సానుకూలంగా స్పందించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ బేస్డ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
పరిశ్రమలు – విద్యా సంస్థల అనుసంధానమే లక్ష్యం
ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు కూడా అత్యంత కీలకమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు విద్యా సంస్థలను ఆధునీకరిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో డేటా సిటీ, ఫార్మా సిటీ వంటివి వస్తున్న తరుణంలో.. వర్టికల్ మరియు హారిజంటల్ ఇంటిగ్రేషన్ విధానం ద్వారా మౌలిక సదుపాయాలు, మార్కెట్ లింకేజీని కల్పిస్తున్నట్లు వివరించారు. 2019లో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని స్పష్టం చేశారు.
మాన్సాస్ దాతృత్వం.. శిథిలావస్థలో భవనాలు
విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. 1982లో ఆనంద గజపతిరాజు గారు 15 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి ఈ పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు రూ.1.10 కోట్లు, కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు అవసరమని సభ దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు సీఎస్ఆర్ (CSR) నిధులను కూడా ఈ కళాశాల అభివృద్ధికి మళ్లించాలని ఆమె కోరారు.
విజయనగరంలో ఏవియేషన్ ఎడ్యుసిటీ
జిఎంఆర్ – మాన్సాస్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ విజయనగరంలో ఏర్పాటు కావడం పట్ల అదితి గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తుండటం సంతోషకరమన్నారు. తన తండ్రి అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ ఎడ్యుసిటీకి అవసరమైన భూమిని అందించగా, మంత్రి లోకేష్ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేలా చొరవ చూపినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
#NaraLokesh #AditiGajapathiRaju #Vizianagaram #PolytechnicEducation #APAssembly #EducationReforms #NorthAndhra #SkillDevelopment

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
