
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. మొదట్లో రెండు మూడు సార్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. అయితే ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు.
వంశీపై ఇప్పటివరకు పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసు, అదే కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, భూ ఆక్రమణ, అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొదటి నాలుగు కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైనా, తరువాత నమోదు చేసిన నకిలీ పట్టాల కేసు కారణంగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. ఇప్పటివరకు వంశీ 100 రోజులకుపైగా జైల్లో గడిపారు.
ఇటీవల నకిలీ ఇళ్ల పట్టాల కేసు విచారణ కోసం కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు ఆయన అనారోగ్యం మరింత తీవ్రంగా మారింది. స్టేషన్లోనే ఆయన వాంతులు చేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఈ నేపథ్యంలో వంశీ భార్య పంకజశ్రీ తన భర్తకు మెరుగైన వైద్యం అవసరమని కోరుతూ ఆయనను మంగళగిరి AIIMS ఆసుపత్రికి తరలించాలని అధికారులను అభ్యర్థించారు. అయితే అధికారులు గుంటూరు జీజీహెచ్‌కే తరలించారు.
గుంటూరు జీజీహెచ్ వద్ద వంశీ భార్య పంకజశ్రీని లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. ఆమె పదే పదే పోలీసులను కోరినా అనుమతి ఇవ్వకపోవడంతో పంకజశ్రీ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. “వంశీ ఆరోగ్య పరిస్థితి ఏంటీ? ఆయనకు ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు? వైద్యులు ఏమంటున్నారు?” అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవడంతో ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఆమెను లోపలికి వెళ్లనివ్వకుండా గేట్లు మూసివేశారు.