ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విప్లవం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ఎంతటి వ్యయానికైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం స్పష్టం చేశారు.
ఆధునిక హంగులతో ఆదర్శ పాఠశాలలు
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పాఠశాల నమూనాలో ఈ వంద స్కూళ్లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానミー (CURE) పరిధిలో నిర్మించే పాఠశాలల్లో అత్యాధునిక తరగతి గదులు, క్రీడా మైదానాలు, రవాణా సౌకర్యం మరియు నాణ్యమైన బోధనా సిబ్బంది ఉండాలని నిర్దేశించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏడాదిలోనే పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాంతో పాటు జామెట్రీ బాక్స్, షూస్ మరియు డిక్షనరీలతో కూడిన పూర్తి స్థాయి కిట్‌ను అందజేయాలని నిర్ణయించారు.
ఏఐ బోధన.. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధ (AI) బోధనను ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఏఐపై స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి, విద్యార్థులను ప్రపంచ పోటీకి సిద్ధం చేయాలన్నారు. అలాగే, 2026-27 విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. హరేకృష్ణ మిషన్ సహకారంతో విజయా డెయిరీ పాలను కూడా విద్యార్థులకు అందజేయాలని, దీని ద్వారా విద్యార్థులకు అందే పోషక విలువలను సాంకేతికత ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.
ప్రైవేట్ ఫీజుల నియంత్రణకు కసరత్తు
ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడి ఫీజుల నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో కమిటీలు పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ సీఎస్ నేతృత్వంలోని కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఫీజుల నియంత్రణ ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి తల్లిదండ్రులు, మేధావుల అభిప్రాయాలను సేకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా తరహాలోనే ఇతర వర్సిటీలకు కూడా భారీగా నిధులు కేటాయిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
#TelanganaEducation #RevanthReddy #PublicSchools #AI #StudentWelfare #EducationSystem #TelanganaNews #SchoolInfrastructure

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
