March 23, 2026

తమిళనాడు ఎన్నిలు: సీట్ల సర్దుబాటుపై ముదురుతున్న ఉత్కంఠ

Tamil nadu parties

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ, రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి కేవలం వారం రోజులే సమయం ఉండటంతో, అన్నాడీఎంకే (AIADMK) నేతృత్వంలోని ఎన్డీయే, డీఎంకే (DMK) నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తమ చర్చలను వేగవంతం చేశాయి.

ఎన్డీయేలో పీయుష్ గోయల్ ఎంట్రీ

రాష్ట్రంలో అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ, తమకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత కోరుతోంది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ ఇన్‌ఛార్జ్ పీయుష్ గోయల్ సోమవారం చెన్నై చేరుకున్నారు. ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలను త్వరగా పూర్తి చేసి, అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించాలని ఆయన భావిస్తున్నారు. అన్నాడీఎంకే అగ్రనేతలతో గోయల్ జరిపే చర్చలు కూటమి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగాలని బీజేపీ పట్టుబడుతోంది.

Read this article also: కేరళలో మార్పు ఖాయం: “టీమ్ UDF అంటే టీమ్ కేరళం” – రాహుల్ గాంధీ ధీమా

డీఎంకే కూటమిలో సీపీఐ(ఎం) పేచీ

మరోవైపు, అధికార డీఎంకే కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు అంత సులభంగా సాగడం లేదు. ముఖ్యంగా సీపీఐ(ఎం)తో జరుపుతున్న చర్చలు ప్రతిష్టంభనకు దారితీశాయి. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మార్క్సిస్ట్ పార్టీకి 6 సీట్లు కేటాయించగా, ఈసారి డీఎంకే కేవలం 5 సీట్లు మాత్రమే ఆఫర్ చేసింది. ఒక సీటు తగ్గించడంపై సీపీఐ(ఎం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కనీసం గత ఎన్నికల నాటి 6 స్థానాలైనా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఈ విషయంలో డీఎంకే వెనక్కి తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాలి.

డీఎంకే,ఇతర పార్టీల పరిస్థితి

డీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే (DMDK) తో పాటు ఇతర చిన్న పార్టీలతో కూడా చర్చలు తుది దశకు చేరుకున్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి పార్టీల సంఖ్య పెరగడంతో, ప్రధాన పార్టీలు తమ సొంత సీట్లను తగ్గించుకోవాల్సి వస్తోంది. డీఎంకే కనీసం 170కి పైగా స్థానాల్లో నేరుగా పోటీ చేయాలని భావిస్తుండటంతో, మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లపై కోత విధిస్తోంది.

గెలుపు వ్యూహాలపైనే దృష్టి

నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంకే.. ఇద్దరూ కూడా బలమైన నియోజకవర్గాలను తమ వద్దే ఉంచుకోవాలని చూస్తున్నారు. పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకే పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే, ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల్లో డీఎంకే తన ప్రభావాన్ని చాటాలని తహతహలాడుతోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో రెండు కూటముల నుంచి పూర్తిస్థాయి జాబితాలు వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *