
కసూర్‌లో టెర్రర్ ర్యాలీ
మోడీ గుర్తుపెట్టుకో.. బుల్లెట్లంటే మాకు భయం లేదు’’ అని కసురి వ్యాఖ్యలు
పహల్గాం (జమ్మూ కాశ్మీర్) లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది సాధారణ ప్రజలు అమాయకంగా బలైపోయిన దుర్మార్గ ఘటన జరిగిన కొన్ని వారాలకే, పాకిస్తాన్ పంజాబ్‌లోని కసూర్‌లో లష్కరే తోయిబా (LeT) టాప్ నేతలు బహిరంగంగా కనిపించి సంచలనం రేపారు. ఈ ర్యాలీకి హాజరైన వారిలో తల్హా సయీద్ మరియు లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ఉన్నారు. వీరిద్దరూ పహల్గాం దాడి తరువాత దాగి ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తల్లా సయీద్ ఐక్యరాజ్యసమితి ప్రకటించిన టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కుమారుడు.
భారీ భద్రత నడుమ నిర్వహించిన “యౌమే తక్బీర్” ర్యాలీలో తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరియు పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారత్ ఇంటెలిజెన్స్ ప్రకారం, పహల్గాం దాడిలో పాల్గొన్నవారంతా LeT ఉగ్రవాదులే. ఈ సభలో అమెరికా ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది అమీర్ హమ్జా “కాశ్మీర్ బనేగా పాకిస్తాన్, జమ్మూ బనేగా పాకిస్తాన్, పంజాబ్ బనేగా ఖలిస్థాన్” అంటూ నినాదాలు చేయడం భారతదేశంపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
భారతదేశంపై నిందలు, మోడీపై విమర్శలు
సైఫుల్లా కసురి పహల్గాం దాడిలో తమ ప్రమేయం లేదని ప్రకటించినప్పటికీ, భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రెచ్చిపోయాడు. పహల్గాం దాడిలో తనపై ఆరోపణల చేసిన తరువాత తాను ప్రసిద్ధుడయ్యానని వ్యాఖ్యలు చేశాడు. ” మాకు బుల్లెట్లంటే భయమని అనుకుంటున్నాడు. అది ఆయన భ్రమ. నేను భారత గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటూనే ఉన్నా, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నేనేం మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయలా?” అంటూ మాట్లాడాడు.
ఇదిలా ఉండగా, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లష్కరే తోయిబా (LeT), జైష్-ఎ-మొహమ్మద్ (JeM) వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా అండదిస్తోంది అన్నదానిపై ప్రశ్నలు వేశారు. “పాక్ సైనిక అధికారుల సమక్షంలో పాకిస్తాన్ జెండాతో ఉగ్రవాదుల అంత్యక్రియలు జరపడం అసాధారణం. వీరిని తాము సాధారణ పౌరులుగా ఎలా గుర్తించగలమో అర్థం కావడం లేదు. మాకు వారు టెర్రరిస్టులే,” అని అన్నారు.
అంతేగాక, ముంబయి 2008 ఉగ్రదాడులలో కీలకపాత్ర వహించిన హఫీజ్ అబ్దుల్ రౌఫ్ అనే లష్కరే తోయిబా నేత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ప్రార్థనలు చేయడం చూపిస్తూ మిస్రి మీడియాకు ఫొటోలు చూపించారు. అమెరికా ప్రభుత్వం రౌఫ్‌ను 2010లో గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించి, ఆర్థిక మద్దతు మరియు లాజిస్టిక్ వ్యవస్థలను నడిపిస్తున్నదిగా వెల్లడించింది.