గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల పవిత్రతను తుంగలో తొక్కి, కల్తీ పాలనతో భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని బీజేపీ రాష్ట్ర నేత పీవీఎన్ మాధవ్ ధ్వజమెత్తారు. తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణం కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, గత ఐదేళ్లలో దాదాపు 200కు పైగా ఆలయాలపై దాడులు జరిగినా నాటి ప్రభుత్వం ‘తుంటరి చర్యలు’గా కొట్టిపారేయడం వారి దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాల పవిత్రతను కాపాడి, దోషులను కఠినంగా శిక్షించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
అక్రమాల పుట్ట టీటీడీ.. రూ.250 కోట్ల అవినీతి బాగోతం
గత ప్రభుత్వంలో టీటీడీని ఆదాయ వనరుగా మార్చుకున్నారని, లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి సరఫరాలో భారీ అక్రమాలు జరిగాయని పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. కనీసం పాల సేకరణే చేయని డైరీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.250 కోట్లు చేతులు మారాయని, సింథటిక్ నెయ్యిని, రసాయనాలను వాడి భక్తుల ఆరోగ్యంతో పాటు వారి విశ్వాసాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా తప్పును ఎత్తిచూపుతుంటే, వైసీపీ నేతలు తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు.
ఆగమ శాస్త్రాలను, సంప్రదాయాలను పట్టించుకోకుండా శ్రీవారి సేవలకు భగ్నం కలిగించారని, అన్యమతస్తులను టీటీడీ బోర్డులో చేర్చి హిందూ ధర్మానికి ద్రోహం చేశారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో రథాలను తగలబెట్టడం, విగ్రహాలను శిరచ్ఛేదం చేయడం వంటి ఘోరమైన పనులు జరిగినా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, తిరిగి ఆరెస్సెస్, బీజేపీలపై నిందలు వేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అప్పటి డీజీపీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించి విచారణను పక్కదోవ పట్టించారని గుర్తు చేశారు.
క్షమాపణలు ఎవరు చెప్పాలి? వ్యవస్థల ప్రక్షాళనే కూటమి లక్ష్యం
వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న క్షమాపణలపై మాధవ్ ఘాటుగా స్పందించారు. “కల్తీ నెయ్యితో లడ్డూలు చేసినందుకు మేము క్షమాపణ చెప్పాలా? అన్యమతస్తులను పీఠాలపై కూర్చోబెట్టినందుకు మేము క్షమాపణ చెప్పాలా? లేక స్వామివారి ఆభరణాలు మాయం చేసినందుకు చెప్పాలా?” అంటూ నిలదీశారు. అక్రమార్కులకు కొమ్ముకాసిన గత పాలకులు భక్తులకు, భగవంతుడికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యమతస్తుల ప్రాబల్యం పెంచి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపిన విధానాలకు ఈ కూటమి ప్రభుత్వంతో చరమగీతం పాడుతామన్నారు.
ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. శ్రీవారి కైంకర్యాలు, ప్రసాదాల తయారీ ఇకపై శాస్త్రోక్తంగా, అత్యంత పారదర్శకంగా జరుగుతాయని భక్తులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భద్రతను పటిష్టం చేస్తూ, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. భక్తుల మనోభావాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, గతంలో జరిగిన ప్రతి నేరాన్ని విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
#PVNMadhav #BJPAndhraPradesh #TirumalaLaddu #TempleSafety #HinduDharma #AndhraPolitics #NDAAP
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.