షార్ట్ సర్క్యూట్‌తో నిలువునా దహనమైన ఇల్లు..
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఓ పేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మండలంలోని పేడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో శ్రీపతి ఆదిశేషయ్య అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కష్టపడి కూడబెట్టుకున్న సంపాదన అంతా కళ్లముందే బూడిదవ్వడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
తాళం వేసి వెళ్లిన కొద్దిసేపటికే ఘోరం
బాధితుడు ఆదిశేషయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాలకు పంపించి, భార్యాభర్తలిద్దరూ ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వస్తున్నాయని స్థానికులు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆదిశేషయ్యకు మంటల్లో కాలిపోతున్న తన ఇల్లు కనిపిం చింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
సిలిండర్ పేలడంతో పెరిగిన మంటల తీవ్రత
షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన మంటలు ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించాయి. దీంతో సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో నిప్పు రవ్వలు ఇల్లంతా వ్యాపించి క్షణాల్లోనే సర్వం బుగ్గిపాలైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇంటి పైకప్పుతో సహా లోపల ఉన్న వస్తువులన్నీ బొగ్గులా మారిపోయాయని బాధితుడు వాపోయాడు.
సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు
ఈ ప్రమాదంలో రెండు సవర్ల బంగారం, నగదుతో పాటు వాషింగ్ మెషీన్, టీవీ, రెండు బీరువాలు, సోఫా వంటి విలువైన వస్తువులు కాలిపోయాయి. “పనికి వేసుకువెళ్లిన కట్టుబట్టలు తప్ప మాకు ఏమీ మిగలలేదు. కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే మాకు ఇంత పెద్ద కష్టం వస్తుందని ఊహించలేదు” అని ఆదిశేషయ్య బోరున విలపించారు. నిస్సహాయ స్థితిలో రోడ్డున పడ్డ తమ కుటుంబాన్ని అధికారులు, పాలకులు స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.
#FireAccident #ShortCircuit #Tragedy #Peduru #HelpNeeded #LocalNews #SafetyFirst #FireSafety

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
