April 17, 2026

ఈడీ అదుపులో అల్-ఫలా యూనివర్సిటీ చైర్మన్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక అడుగు వేసింది. అల్-ఫలా ఛారిటబుల్ ట్రస్ట్, అల్-ఫలా యూనివర్సిటీ డైరెక్టర్ మరియు ప్రధాన వాటాదారు అయిన జవాద్ అహ్మద్ సిద్ధిఖీని పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 24న ఢిల్లీ జోనల్ కార్యాలయం చేపట్టిన ఈ చర్యలో భాగంగా సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. సిద్ధిఖీ ఇతర వ్యక్తులతో కలిసి ఫోర్జరీ పత్రాలను సృష్టించి అక్రమంగా భూమిని సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. ఆగ్నేయ ఢిల్లీలోని మదన్‌పూర్ ఖాదర్ గ్రామంలో సుమారు 1.146 ఎకరాల భూమిని (ఖస్రా నంబర్ 792) అక్రమ పద్ధతుల్లో దక్కించుకున్నట్లు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ఈ భూమి విలువ దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శాంతి చర్చల వారధిగా పాకిస్థాన్ ఈ వార్తను కూడా చదవండి

ఈ భూమికి సంబంధించిన పత్రాల్లో విక్రయ ధరను కేవలం రూ. 75 లక్షలుగా చూపినప్పటికీ, అసలు లావాదేవీలు అంతకంటే భారీ స్థాయిలో జరిగినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. నేరాల ద్వారా వచ్చిన నిధులను (Proceeds of Crime) మళ్లించి ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జనవరి 17న సిద్ధిఖీపై ఈడీ అభియోగపత్రం (చార్జ్‌షీట్) దాఖలు చేసింది.

అరెస్ట్ చేసిన అనంతరం సిద్ధిఖీని సాకేత్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో మార్చి 25న ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నిందితుడిని ఏప్రిల్ 4 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నిధుల మళ్లింపు వెనుక ఉన్న ఇతర లబ్ధిదారులు ఎవరు? ఇంకా ఏయే ఆస్తులు అక్రమంగా కొనుగోలు చేశారు? అనే అంశాలపై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనతో ఈ నిధులకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

ED #MoneyLaundering #DelhiNews #AlFalahUniversity #BreakingNews #CrimeNews #PMLA

శాంతి చర్చల వారధిగా పాకిస్థాన్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *