జగన్ సీఎం అయిన తరువాత అత్యధికంగా లబ్ది పొందింది సుబ్బారెడ్డే.
రేపు విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతారు.
భారతి కూడా జైలుకు వెళ్లాలి.
‘సజ్జల మాట్లాడినా, సాక్షి రాసినా తాను పెద్దగా పట్టించుకోను. కానీ చిన్నాన్న సుబ్బారెడ్డి మాట్లాడితే.. నా కళ్ళల్లో నీరు తిరిగాయి. నా బిడ్డలు నీ ముందు పెరగలేదా.. తాత అని పిలవలేదా? ఏది నిజమో, ఏది అబద్దమో మీకు తెలియదా.. ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు ఉన్నాడు.. నాన్న పైన ఉన్నాడు.. చూస్తున్నారు..’ అని షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.
సుబ్బారెడ్డిగారు చెప్పే నిజమా… ఆ విషయం ఆయనకు తెలియదా? ఆయన చెప్పేవన్ని నిజమని ఆయన ప్రమాణం చేయగలరా? అని వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పనిలోపనిగా విజయసాయిరెడ్డిపై కూడా మండిపడ్డారు. ఆస్తుల వివాదంపై తన తల్లి విజయమ్మ స్పందిస్తారని షర్మిల ప్రకటించారు.
ఆఇప్పుడిప్పుడే ప్రజలు కల్తీ లడ్డు గురించి మరిచిపోతున్నారని.. ఇలాంటి సమయంలో వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు తన మీద ఎందుకు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు తన మీద ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుని తప్పకుండా స్పందిస్తానని అన్నారు.
జగన్ మోచేతి నీళ్లు తాగే మీరా మాట్లాడేది !
జగన్ వ్యాఖ్యలకు మద్దతుగా సుబ్బారెడ్డి స్పందించారు. దీనిపై షర్మిల తిరిగి వ్యాఖ్యలు చేశారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జగన్ పక్కనే ఉండి.. పదువులు ఇస్తే అనుభవించారని దుమ్మెత్తిపోశారు. అలాంటి సుబ్బారెడ్డి.. ఇలా కాకుంటే ఇంకెలా మాట్లాడుతారని అన్నారు.
సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా కూడా గట్టిగానే లాభపడ్డారని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాక వారికి మాత్రమే మేలు జరిగిందనేది వాస్తవం అన్నారు. ఒక్క సుబ్బారెడ్డే కాదు.. రేపటి రోజున విజయసాయి రెడ్డి కూడా మాట్లాడతారని షర్మిల చెప్పుకొచ్చారు. వైవిసుబ్బారెడ్డి అయినా, సాయిరెడ్డి అయినా.. జగన్ పక్షాన ఉన్నారని తెలిసి కూడా తాను రాసిన లేఖలో వారి పేర్లు ప్రస్తావించానని షర్మిల చెప్పారు.
వాళ్లల్లో నిజాయతీ ఏమైనా ఉంటుందేమో ప్రజలకు అర్థం కావాలనే వారి పేర్లు పెట్టానన్నారు. తమ అమ్మకు కూడా పూర్తిగా వాస్తవాలు తెలుస్తాయనే పెట్టానన్నారు. రాజశేఖరరెడ్డి ఆలోచనలు, ఆశయాలు వారికి అన్నీ తెలుసునని షర్మిల చెప్పారు. అయినా కూడా ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే.. వారి నిజరూపం ప్రజలకు అర్థం కావాలని, ముఖ్యంగా అమ్మ తెలుసుకోవాలని అన్నారు. తన వరకు తాను చెబుతున్నందతా నిజమని ప్రమాణం చేయగలనన్నారు షర్మిల. సుబ్బారెడ్డి చెప్పేదంతా నిజమని ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను చెప్పేవన్నీ వాస్తవాలు అని ఉద్ఘాటించారు షర్మిల.
నలుగురు బిడ్డలకు సమాన వాటా ఉండాలని వైఎస్ఆర్ ఆలోచన చేశారన్నారు. ఇది నిజమని తన బిడ్డలపై తాను ప్రమాణం చేస్తున్నానని అన్నారు. వైఎస్ఆర్ ఆఖరి రోజుల్లో కూడా ఆస్తులు పాప పేరు మీద బదిలీ అవలేదని కూడా అడిగారని.. ఆ రోజు జగన్ మూడు అడుగుల కన్నా తక్కువ దూరంలో కూర్చుని నాన్నకు మాట ఇచ్చారు. ‘నాన్నా… ఈ లోకంలో మీ తర్వాత పాప మేలు కోరే వారిలో నేనే మొదటి వాడిని, డోంట్ వర్రీ డాడ్’ అని చెప్పారు. ఇదంతా నిజమని నా బిడ్డలపై నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. సుబ్బారెడ్డి కూడా తన బిడ్డలు, తన మనవళ్లపై ప్రమాణం చేసి నిన్న చెప్పినదంతా నిజమని చెప్పగలరా? అని షర్మిల ప్రశ్నించారు.
‘భారతి, జగతికి అయితే ఏమీ.. వాళ్ల పేర్లు పెట్టుకున్నామని అంటున్నారు. ఆ రోజు వాళ్లకు కుదిరింది కాబట్టి.. ఆస్తులన్నీ జగన్, భారతీలవేనట. ఆ రోజు మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టే.. వాళ్లు ఆ పేర్లు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కూడా పేర్లు పెట్టుకుంటే నష్టం ఏముందిలే అని ఆరోజు అనుమతించారు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్లవేనని అంటే ఎలా? ఆస్తులు జగన్‌వి కాబట్టే.. ఆయన జైలుకు వెళ్లాడని సుబ్బారెడ్డి అన్నారు. మరి ఆస్తులు భారతివి అయితే.. ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా? ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్లాలని రూల్ ఏమీ లేదు. ఎవరు అవినీతి చేశారో చూసి.. వారిపై కేసులు పెడతారు. సుబ్బారెడ్డి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది.’ అని షర్మిల అన్నారు.
గిఫ్ట్ అయినప్పుడు ఎంవోయు ఎందుకు?
జగన్మోహన్ రెడ్డి తనకు ఆస్తి గిఫ్ట్‌గా ఇస్తే.. ఎంఓయూ ఎందుకో సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు. ఎంఓయూలో 4.2లో ఆనాడు సరస్వతీ షేర్స్ ఎటాచ్ కాలేదు కాబట్టి.. వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తామని, సైన్ చేస్తున్న ఈ ఎంఓయూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్‌ఫర్ అనే పదాన్ని అండర్ లైన్ చేసి చెబుతున్నాను. అటాచ్ కాలేదు.. ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలిసే.. ఈ ఒప్పందాలు చేశారు.
అన్ని ఇళ్ళల్లో ఉండే విషయమే అని జగన్ చాలా సింపుల్‌గా చెప్పేశారు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చటం ఘర్ ఘర్‌కా కహానీనా జగన్. కన్న తల్లిని ఆస్తి కోసం కోర్టుకు లాగిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అంత సునాయశంగా, సులభంగా మాట్లాడుతున్నారంటే.. మీకు మానవత్వం ఉందా.. ఎమెషన్స్ లేవా?’ అని జగన్ తీరుపై షర్మిల తీవ్రంగా స్పందించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.