March 27, 2026

ఘోర ఉగ్రవాదులను అప్పగించు, లేకపోతే మరో గుణపాఠమే: రాజ్‌నాథ్‌

ఉగ్రవాద ప్రేరణలపై పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. ‘ఒపరేషన్‌ సింధూర్‌’ ముగిసిందనుకోవద్దని, అది కేవలం తాత్కాలిక విరామమని, తిరిగి తప్పు చేస్తే పాకిస్తాన్‌ కోలుకునే అవకాశమే ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని నాశనం చేయాలంటే, తొలి అడుగు: హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌ను భారత్‌కు అప్పగించండి అని సూచించారు. అవి మాటలే కాకుండా చర్యలు కావాలన్నారు.

ఆపరేషన్‌ సింధూర్‌—తాత్కాలిక విరామమే, పూర్తికాదని స్పష్టం

గోవాలో INS విక్రాంత్‌ నౌకపై నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్‌నాథ్‌ మాట్లాడారు. “ఆపరేషన్‌ సింధూర్‌ పూర్తి కాలేదు. అది కేవలం హెచ్చరిక. పాకిస్తాన్‌ మళ్లీ అదే తప్పు చేస్తే, ఈసారి భారత్‌ ప్రతీకారం మరింత తీవ్రంగా ఉంటుంది. కోలుకునే సమయమే ఉండదు,” అని స్పష్టం చేశారు.

భారత నౌకాదళం సముద్ర తుఫాన్‌లా మారగలదు

భారత నౌకాదళ సైనికుల ధైర్యసాహసాలను కొనియాడిన రాజ్‌నాథ్‌ INS విక్రాంత్‌పై మాట్లాడుతూ—“మీ బలమైన సంసిద్ధత శత్రువుల మానసిక స్థైర్యాన్ని భంగపరిచింది. యుద్ధం అవసరం లేకుండానే వారిని భయపెట్టింది. పాకిస్తాన్‌ భారత్‌ నౌకాదళ శక్తిని పూర్తిగా గుర్తించింది,” అన్నారు.

పాక్‌ నౌకాదళాన్ని తీరానికే పరిమితం చేసిన భారత దళాలు

ఫహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’లో భారత దళాలు అద్భుతంగా ప్రదర్శించాయని పేర్కొన్నారు. వాయుసేన పాక్‌లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయగా, నౌకాదళం అరేబియా సముద్రంలో పాకిస్తాన్‌ నౌకలను తీరానికి పరిమితం చేసింది. “పాక్‌ నౌకలు బయటకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాయి,” అని వివరించారు.

ఉగ్రవాదంపై తేలికపాటి వ్యవహారం ఇక కాదు

“భారత్‌ ఇక భరించదు. ప్రతి దాడికి గట్టి బదులిస్తుంది. ఈసారి దాడి చేసిన తర్వాత పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా వేడుకోలు చేయాల్సి వచ్చింది,” అన్నారు.

హఫీజ్‌-మసూద్‌లను అప్పగించండి: సంభాషణలు అయితే నిజమైనవి కావాలి

పాకిస్తాన్‌ సంభాషణలు కోరుతోందంటే, మౌఖికం కాదు, కార్యాచరణతో చూపించాలి. “హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌లను భారత్‌కు అప్పగించండి. వారు భారత ‘మోస్ట్ వాంటెడ్‌’ ఉగ్రవాదులు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదుల జాబితాలో కూడా ఉన్నారు. ముంబయి దాడుల్లో నిందితుడు తహవ్వూర్‌ రాణాను భారత్‌కు అప్పగించినట్లు, వీరినీ అప్పగించాలి,” అన్నారు.

INS విక్రాంత్‌ – దేశ నౌకా శక్తికి ప్రతీక

13 ఏళ్లపాటు రూ. 20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 45,000 టన్నుల INS విక్రాంత్‌ను ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం జాతీయ సేవలోకి ప్రవేశపెట్టారు. దీని లో 76% స్వదేశీ భాగస్వామ్యం ఉంది. దీని పొడవు 262 మీటర్లు, ఇందులో 15 డెక్స్‌లు, 2,300 విభాగాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *