April 12, 2026

దేశంలో పెట్రో బాంబ్: ప్రీమియం పెట్రోల్ ధరలు భారీగా పెంపు!

లీటరుకు రూ.2.35 వరకు పెంచిన చమురు సంస్థలు..

సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం!

​పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారతీయ వాహనదారులపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. ముడి చమురు సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరుకోవడమే ఈ పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ప్రీమియం పెట్రోల్ ధరల వివరాలు:

ఇండియన్ ఆయిల్ (IOCL), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) సంస్థలు ప్రాంతాన్ని బట్టి లీటరు ప్రీమియం పెట్రోల్‌పై రూ.2 నుండి రూ.2.35 వరకు పెంచాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి.

  • బీపీసీఎల్ స్పీడ్ (Speed), హెచ్‌పీసీఎల్ పవర్ (Power), ఐఓసీఎల్‌ ఎక్స్‌పీ95 (XP95) రకం పెట్రోల్ ధరలు లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 మేర పెరిగాయి.
  • ​అయితే, సామాన్య వాహనదారులకు ఊరటనిస్తూ సాధారణ పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

పరిశ్రమలపై ‘డీజిల్’ భారం:

సాధారణ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఐఓసీఎల్ సంస్థ ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా రూ.22 మేర పెంచింది. దీంతో ఇప్పటివరకు రూ.87.67గా ఉన్న లీటరు ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.105.59కు చేరింది. ఇది భారీ పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలపై అదనపు భారాన్ని మోపనుంది.

​సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ వాహనాలు మరియు హై-పెర్ఫార్మెన్స్ ఇంజన్లు కలిగిన వాహనదారులు అధిక మైలేజీ కోసం ఈ ప్రీమియం పెట్రోల్‌ను వినియోగిస్తారు. తాజా పెంపు ప్రభావం ప్రధానంగా సంపన్న వర్గాలపైనే ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *