
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తన మాతృరంగంపై విపరీతమైన కోపం వచ్చింది. ఐక్యత లేదు, కృతజ్ఞత లేదు, ‘మీకు ఎంత చేసినా ఇంతే’ అని అంటూ సినిమా రంగంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది గడుస్తున్న కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదంటూ శివాలెత్తిపోయారు. సినిమా రంగం బాగుపడాలని, దానికి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా, ఇద్దరికి ప్రతినిధిగా అంటే ప్రభుత్వ ప్రతినిధి, ఇటు సినీరంగ ప్రతినిధిగా తానే ఉండాలనే ఉబలాటం, తాపాత్రయం ఉన్నాయనిపిస్తుంది.
ఆయన ప్రకటన చూస్తే, సినిమా రంగానికి ఎంతో చేయాలని ఉన్నారని అనిపిస్తుంది. ఆయన హూంకారం, ఘీంకారం చూసిన సినీ పెద్దలు గజ గజ వణికిపోయారు. పవన్ కళ్యాణ్‌ను శాంతింపజేయడానికి ఆపసోపాలు పడ్డారు. తాను కాదంటే, తాను కాదంటూ నిర్మాతలు సురేష్, అరవింద్‌లు స్టేట్‌మెంట్ల మీద స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. కానీ, అసలు విషయం మాత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలే అని సినీ జగమెరిగిన సత్యం.
ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖలపై తెలంగాణ ప్రభుత్వం తన ప్రతాపం చూపింది. అదే సమయంలో సినీ హీరో అల్లు అర్జున్‌పై కేసులో అక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం రెండూ వేలుపెట్టి చిలవలు పలువలు చేశాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా తన ప్రతాపం చూపింది. నేలమట్టం చేసింది. డ్రగ్స్ కేసులో చాలా మంది హీరోలను హీరోయిన్లపై కేసులు నమోదయ్యాయి. సినిమా రంగాన్ని ఓ పట్టుపట్టారన్నమాట. కానీ, ఇక్కడ ఒక అంశం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా కూడా మెగా కుటుంబానికి చెందిన వారి, నందమూరి వారసులపై ఈగ కూడా వాలలేదు. మతలబేంటి? అంటే తెలుగు రాష్ట్రాల పాలకులు ఆడిన నాటకమే. ఈ రెండు కుటుంబాలు ఒకే కూటమి కింద ఉన్నాయి. మిగిలిన వారిలో కొంత మంది రాజకీయాలకు దూరంగా ఉండగా, కొంత మంది ఇతర పక్షాలను సమర్థిస్తున్నారు.
బెంబెలెత్తిన సినీరంగ పెద్దలు మాకెక్కడి గొడవలెమ్మంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వారిలో కొంత మంది తమ వ్యక్తిగత పరిచయాలతో ప్రభుత్వం పెద్దలను ప్రసన్నం చేసుకున్నారు. ఇదెలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని డిస్టిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు తమ డిమాండ్లను ముందుకు తీసుకువస్తూ సమ్మె చేయాలని తలపించారు. ఈ మేరకు సమావేశం అయ్యారట. ఎక్కడా? తెలుగు సినీ రాజధాని భాగ్యనగరంలో. దీనిపై ఇక్కడున్న పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కోపం వచ్చింది. అంతే సినీరంగ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమను ఉద్దరించేసినట్లు, ముందు ముందు మహోద్ధరణ చేయాలనుకుంటే వారు పట్టించుకోనట్లు ఆ నలుగురిపై విరుచుకుపడ్డారు.
సినిమా పరిశ్రమ స్వయంగా జీవిస్తోందా? ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో నడుస్తోందా? అనే విషయం తెలుగు రాష్ట్రాలలో చిన్న పిల్లాడిని అడిగిన చెబుతారు. వారిని వేధించకపోతే అదే పదివేలు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. మరి మన పొలిటికల్ పవర్ స్టార్‌కు ఎందుకు అంత కోపవచ్చింది. ఆయన ప్రకటన చేయకముందే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమ్మె అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించారని ఆరా తీస్తే… ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని తేలింది.
మజ్జిగకు వచ్చి ముంత దాచినట్లు పవన్ కళ్యాణ్ తెలుగు చిత్రసీమ ఏకీకృతంగా సహకరించడంలో విఫలమైనందుకు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. సినీ రంగానికి పరిశ్రమ హెూదా కల్పించి, అభివృద్ధిని ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, చిత్రసీమ కనీస మర్యాద, ఐక్యతను చూపించడంలో విఫలమైందని పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వంటి సంస్థలు మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని మండిపడ్డారు. పనిలో పనిగా గత ప్రభుత్వం సినిమా రంగాన్ని వేధించిందని తీరని నష్టం కలిగించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ హయాంలో తన సహచర హీరో ‘మా’ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో ఉండి ముఖ్యమంత్రిని అర్జెంటుగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సినిమాలు సినిమాలే, రాజకీయాలు రాజకీయాలేనని అన్నారు. అప్పుడు ఈ పొలిటికల్ పవర్ స్టార్ నో కామెంట్. ఆ తరువాత స్వయానా తన సోదరుడు చిరంజీవి సతీసమేతంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని కలిసి విందు ఆరగించి వెళ్ళితే జగన్మోహన్ రెడ్డి అవమాన పరిచారని ఆరోపించారు. దానినే ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నారు కూడా.
సరే సినిమా రంగం ఏనాడో చీలిపోయింది. సినిమా కుటుంబాలలో కొన్ని నేరు తెలుగుదేశం పార్టీకి, మరికొన్ని పరోక్షంగా వైఎస్సార్సీపీని సమర్థిస్తున్న విషయం జగమెరిగిన సత్యం. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక స్వామి కార్యం, స్వకార్యం కలిసి వస్తాయనేది పరమార్థం. తన సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతున్న సందర్భాలు సినిమా థియేటర్ల బంధ్ ఏంటనేది ఆయన ఆహాన్ని దెబ్బతీసింది. ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుందనేది తెలిసిన విషయమే. ఇంత పెద్ద స్టార్ ప్రభుత్వంలో ఉంటే సినిమా రంగం ప్రభుత్వాన్ని కలవలేదనే మాట చంద్రబాబు నుంచి రాకుండా చూసుకోవడానికే రంకెలు వేశాడు. సినిమా రంగ పెద్దలను అదరగొట్టాడు, బెదరగొట్టాడనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
థియేటర్లలో టికెట్ అమ్మకాలు పన్ను, ఆదాయం మధ్య అసమానతలను, ఆహార పానీయాల అధిక ధరలు, పేలవమైన పారిశుధ్యం, మంచినీటి సౌకర్యాల కొరత వంటి సమస్యలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, స్థానిక అధికారుల ద్వారా తనిఖీలకు ప్రేరేపిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో మల్టీప్లెక్స్ సంఖ్య, టికెట్ ధరలు, కార్యకలాపాల తేడాలను పరిశీలించడానికి సినిమాటోగ్రఫీ విభాగం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పవర్ స్టారా? మజకా? అందునా పొలిటికల్ పవర్ స్టార్..