March 27, 2026

తెలుగు సినీ రంగానికి తెలిసిన మర్యాద ఇదేనా? : పవన్ కళ్యాణ్ అసహనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, దాని అభివృద్ధికి తోడ్పడాలనే అంశంలో ప్రభుత్వం ప్రాముఖ్యత చూపడంలో ప్రభుత్వం ప్రయాస పడుతుంటే సిని రంగంలోని పెద్దలు మర్యాదలేకుండా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాది కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తెలుగు సినిమా సంఘాలు ఒకసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.

‘‘కేవలం సినిమాల విడుదల సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వం సహకరించడం తప్ప, పరిశ్రమ అభివృద్ధిపై ఏకతాటిపైకి వచ్చేందుకు స్పందించలేదంటూ’’ పవన్ కళ్యాణ్ సినిమారంగానికి చెందిన వారిపై మండిపడ్డారు. తాను అనేకసార్లు ప్రతిపాదనలు చేసినా, సినిమావాళ్ల నుంచి సరైన స్పందన రాలేదని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ తీరు పట్ల విమర్శలు
తెలుగు సినీ పరిశ్రమకు గత ప్రభుత్వం వేసిన అడ్డంకులను ఈ ప్రకటనలో స్పష్టంగా ప్రస్తావించారు. అగ్రనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులపై గత ప్రభుత్వ వైఖరి దౌర్జన్యంగా ఉండేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మితమయ్యే సినిమాలకు అందాల్సిన గౌరవం, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన గుర్తుచేశారు.

‘‘గత ప్రభుత్వ కాలంలో కొన్ని సినిమాల విడుదలను అడ్డుకోవడానికి తహసీల్దార్లను థియేటర్ల వద్దకు పంపించారు. అది నిర్మాతలకు ఎదురైన అవమానం,’’ అని పవన్ ఆరోపించారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వ్యక్తులను తేడా చేయకుండా ప్రోత్సహించే విధానాన్ని అనుసరిస్తోందని, అక్కినేని కుటుంబానికి చెందిన సినిమా విడుదల సమయంలోనూ సముచిత సహకారం అందించిన ఉదాహరణగా పేర్కొన్నారు.

సృజనాత్మకత, పెట్టుబడులు కలిసిన సినీ రంగాన్ని అభివృద్ధి చేయడం, అందులో ఉన్నవారికి గౌరవం ఇవ్వడం కూటమి ప్రభుత్వ ధోరణి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యవస్థ బలంగా ఉండాలి; దానిపై ఆధారపడే వారిని ఇబ్బందుల్లోకి నెట్టకూడదని ఆయన అన్నారు.

ఈయన ప్రెస్ నోట్ విడుదల చేయడానికి కారణం ఏంటంటే ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 విడుదల కానున్నది. అయితే సినిమా థియేటర్ల యజమానులు, డిస్టిబ్యూటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసేసి సమ్మెకు దిగుతున్నారు. దీని వెనుక ఎవరున్నారనే అంశంపై ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *