March 25, 2026

రామతీర్థంలో ‘గిరి’ శోభ.. పవన్ ప్రారంభం

DEPUTY CM PAWAN KALYAN

DEPUTY CM PAWAN KALYAN

విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో భక్తుల దశాబ్దాల కల నెరవేరింది. శ్రీరామ నవమికి ముందే సీతారాముల వారి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఈ రహదారి, గతంలోని చేదు జ్ఞాపకాలను చెరిపివేసి రామతీర్థంలో సరికొత్త అభివృద్ధి వెలుగులు నింపింది. హిందూ ధర్మ పరిరక్షణకు, ఆలయాల పవిత్రతను కాపాడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


గత ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో జరిగిన రాములవారి విగ్రహ శిరచ్ఛేదం ఘటనపై పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా స్పందించారు. నాడు ఆ ఘటన కోట్లాది మంది హిందువులతో పాటు తనను కూడా ఎంతో వేదనకు గురిచేసిందని గుర్తు చేసుకున్నారు. నాటి బాధను తలుచుకుంటూనే, నేడు అదే పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం సుందరమైన గిరి ప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడం తన అదృష్టమని పవన్ పేర్కొన్నారు.

రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో ముళ్ల కంపలు, రాళ్లతో నిండి భక్తులకు నరకాన్ని చూపించేది. ఎమ్మెల్యే లోకం మాధవి విన్నపం మేరకు స్పందించిన ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన 3.70 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించింది. శ్రీరామ నవమి వేడుకలకు ముందే ఈ మార్గం సిద్ధం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధి కోసం గత 20 నెలల్లో రూ.40 కోట్లు వెచ్చించి 22 ప్రధాన క్షేత్రాలకు రోడ్డు వసతి కల్పించినట్లు డిప్యూటీ సీఎం వివరించారు.

కేవలం రామతీర్థమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రముఖ క్షేత్రాలపైనా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చామని, కోటప్పకొండ వద్ద కూడా రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.

PawanKalyan #Ramatheertham #AndhraPradesh #SriRamaNavami #TempleDevelopment #Vizianagaram #JanaSena #TDP #SpiritualIndia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *