March 19, 2026

తిరుమల లడ్డూ కల్తీ కేసు: దోషులను వదిలే ప్రసక్తే లేదు: పవన్

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంలో దోషులుగా తేలిన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు గత పాలకులు బరితెగించారని ఆయన మండిపడ్డారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రులు, మిత్రపక్షాల నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన కీలక నిజాలను బయటపెట్టారు.

అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలే పంపారు

అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠకు కూడా కల్తీ నెయ్యితో చేసిన లక్ష లడ్డూలను పంపడం దారుణమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఈ పాపం హిందూ ధర్మంపై జరిగిన దాడి అని అభివర్ణించారు. 2022లోనే నెయ్యి కల్తీపై నివేదికలు వచ్చినా, నాటి పాలకులు వాటిని తొక్కిపెట్టి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు.

అసలు అది నెయ్యే కాదు: సీబీఐ, ఎన్‌డీడీబీ నివేదికలు

లడ్డూ తయారీకి వాడిన ద్రావణం అసలు పాల నుంచి తీసిన నెయ్యే కాదని సీబీఐ నివేదికలో తేలిందని పవన్ పేర్కొన్నారు. ఎన్‌డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ వంటివి కలిశాయని స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో వాడిన 58 లక్షల కేజీల నెయ్యిలో అధిక భాగం పామ్ ఆయిల్, కెమికల్స్ ఉన్నాయని విచారణలో వెల్లడైందన్నారు. కేవలం రూ. 320 కే కిలో నెయ్యి కొన్నారంటేనే అందులో కల్తీ ఉందని సామాన్యులకు కూడా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

దేవాలయాలపై దాడులను పిచ్చోడి పనిగా చిత్రీకరించారు

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 219కి పైగా దేవాలయాలపై దాడులు జరిగినా నాటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పవన్ విమర్శించారు. రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధం వంటి ఘటనలను ఆకతాయిల పనిగా, పిచ్చోడి పనిగా కొట్టిపారేశారని మండిపడ్డారు. భగవంతుడికి ఉన్నది రెండు కొండలే అనే వారసత్వం నుంచి వచ్చిన వారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారని విమర్శించారు. చేసిన తప్పుకు ఏడుకొండలవాడికి క్షమాపణ చెప్పే వరకు ఈ ధర్మయుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

#PawanKalyan #TirumalaLaddu #Tirupati #ApPolitics #LadduControversy #SanatanaDharma #JusticeForTirumala #AndhraPradesh #SpiritualWar #TirumalaPrasadam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *