March 19, 2026

పార్లమెంటులో రణరంగం: 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్! 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభా మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించారనే కారణంతో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను (ఏడుగురు కాంగ్రెస్, ఒకరు సిపిఐ(ఎం)) స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.

ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం. నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టడం, దానికి స్పీకర్ అనుమతించకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసరడంతో, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించింది. మరోవైపు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై ప్రధాని మోదీ సంతకం చేయడం వెనుక ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ (Epstein Files) మరియు అదానీ కేసుల ఒత్తిడి ఉందని సంచలన ఆరోపణలు చేయడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.


ఎంపీలపై సస్పెన్షన్ వేటు – సభలో అసలేం జరిగింది?

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) అనే పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించగా, ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇంకా ప్రచురణకు నోచుకోని, ఆర్మీ పరిశీలనలో ఉన్న పుస్తకంలోని అంశాలను సభలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.

సస్పెండ్ అయిన ఎంపీలు :

  1. మాణిక్కం ఠాగూర్ (తమిళనాడు)

  2. ఎస్. వెంకటేశన్ (సిపిఐ-ఎం, తమిళనాడు)

  3. గుర్జీత్ సింగ్ ఔజ్లా (పంజాబ్)

  4. అమరీందర్ సింగ్ రాజా (పంజాబ్)

  5. సి. కిరణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ)

  6. హిబీ ఈడెన్ (కేరళ)

  7. డీన్ కురియకోస్ (కేరళ)

  8. ప్రశాంత్ పడోలే (మహారాష్ట్ర)

వీరందరినీ మిగిలిన బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రజాస్వామ్య చరిత్రలో విపక్ష నేతను మాట్లాడనివ్వకపోవడం చీకటి రోజని కాంగ్రెస్ అభివర్ణించింది.


రాహుల్ ఆరోపణలు: ఎప్‌స్టీన్ ఫైల్స్- అదానీ లింక్

సభ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అకస్మాత్తుగా సంతకాలు జరగడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. గౌతమ్ అదానీపై అమెరికాలో ఉన్న కేసు వాస్తవానికి మోదీ ఆర్థిక వ్యవస్థపై ఉన్న కేసేనని, అలాగే ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో ఉన్న కొన్ని సున్నితమైన అంశాలను బయటపెడతామని ట్రంప్ ప్రభుత్వం బెదిరించడం వల్లే మోదీ లొంగిపోయారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ప్రధాని మోదీ రాజీ పడ్డారు (Compromised). ట్రంప్‌కు భయపడి భారత రైతుల రక్తాన్ని, చెమటను అమెరికాకు అమ్మేశారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం వల్ల భారత వ్యవసాయ రంగానికి జరిగే నష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఈ ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, రాహుల్ మళ్ళీ వాటిని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

#ParliamentSession #CongressMPsSuspended #RahulGandhi #ModiVsTrump #NaravaneBook #IndiaUSTradeDeal #AdaniCase

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *