April 13, 2026

War Updates: సౌదీకి పాక్ యుద్ధవిమానాలు

PAKISTAN SENDS MILITARY FORCE TO SAUDI ARABIA

PAKISTAN SENDS MILITARY FORCE TO SAUDI ARABIA

సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన కీలక రక్షణ ఒప్పందంలో భాగంగా పాక్ తన సైన్యాన్ని, యుద్ధ విమానాలను భారీగా సౌదీకి తరలించింది. సుమారు 13 వేల మంది సైనికులు, 18 వరకు ఫైటర్ జెట్లు శనివారం సౌదీలోని కింగ్ అబ్దులజిజ్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య రక్షణ సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ మోహరింపు చేపట్టినట్లు సౌదీ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఆయిల్‌ సంక్షోభం: ప్రపంచానికి ముప్పు ఈ వార్తను కూడా చదవండి

గతేడాది సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాటో నిబంధనల తరహాలోనే, ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి సంయుక్తంగా ఎదుర్కొంటారు. అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్‌తో ఈ స్థాయి ఒప్పందం కుదరడం వల్ల సౌదీ అరేబియాకు అంతర్జాతీయ స్థాయిలో భారీ రక్షణ కవచం లభించినట్లయింది.

ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూనే, మరోవైపు తన మిత్రదేశమైన సౌదీకి భారీగా బలగాలను పంపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే, సౌదీలో పాక్ సైన్యం ల్యాండ్ కావడం గమనార్హం. కేవలం సైనికులే కాకుండా, క్షిపణి నిరోధక వ్యవస్థలను కూడా పాక్ ఇప్పటికే సౌదీకి తరలించినట్లు సమాచారం.

సౌదీ, పాక్ దేశాల మధ్య 1960ల నుంచే బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. గతంలో యెమెన్ యుద్ధం సమయంలోనూ పాక్ తన బలగాలను సౌదీకి పంపింది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, కింగ్ అబ్దులజిజ్ ఎయిర్ బేస్‌లో పాక్ బలగాల మోహరింపు పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్న 10 వేల మంది సైనికులకు తోడుగా ఇప్పుడు అదనపు బలగాలు చేరడంతో సౌదీ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది.

#Pakistan #SaudiArabia #DefenseDeal #FighterJets #MiddleEastAlert #MilitaryCooperation #InternationalNewsTelugu

ఆయిల్‌ సంక్షోభం: ప్రపంచానికి ముప్పు ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *