September 4, 2026

జూన్ 7 నుంచి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు !

తిరుపతి, జూన్ 05: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు (Teppotsavalu) జూన్ 7 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో ప్రత్యేకమైన పాంచరాత్ర ఆగమపూజలు (Agama Pujas) అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ రమణీయమైన తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు కష్టాలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షం (Moksham) సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ సకల జీవకోటికి మాతృమూర్తిగా మారి, భవసాగరంలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.

తెప్పోత్సవాల మొదటి రోజు, జూన్ 7న, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై విహరిస్తారు.

రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి తెప్పపై భక్తులకు దర్శనమిస్తారు.

చివరి మూడు రోజులు, అంటే జూన్ 9, 10, 11 తేదీలలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జూన్ 7వ తేదీ రాత్రి 7.30 – 8.30 గంటల మధ్య శ్రీకృష్ణ స్వామివారు,

జూన్ 8వ తేదీన శ్రీ సుందరరాజస్వామి వారు, జూన్ 9వ తేదీన శ్రీ పద్మావతీ అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగింపు (Procession) నిర్వహిస్తారు.

జూన్ 10వ తేదీ రాత్రి 8.30 – 10.00 గంటల మధ్య గజ వాహనంపై, జూన్ 11వ తేదీ రాత్రి 8.30 – 10.00 గంటల వరకు గరుడ వాహనంపై అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

కాగా, జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం (Kalyanotsavam), ఊంజల్‌సేవ (Unjal Seva) వంటి ఆర్జితసేవలను రద్దు చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీకు ఆసక్తి కలిగించే వార్తలు