- న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు:
న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ పార్లమెంటు సాక్షిగా నోరుపారేసుకున్నారు. జాతి వివక్షను చూపినట్లు వ్యవహరించారు. భారతీయ పౌరుల నుంచి వచ్చే ఈ-మెయిల్‌లను ‘స్పామ్’తో పోల్చుతూ చాలా అవహేళనగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు భారత్-న్యూజిలాండ్ సంబంధాలపై, ముఖ్యంగా ప్రజల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పలువురు విమర్శిస్తున్నారు.
మే 6న న్యూజిలాండ్ పార్లమెంట్‌లో కార్మిక పార్టీకి చెందిన విల్లో-జీన్ ప్రైమ్ తన వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాకు వచ్చిన లేదా పంపిన అన్ని ఈ-మెయిల్స్‌ను అధికారిక రికార్డు కోసం భద్రపరచారా అని మంత్రి స్టాన్‌ఫోర్డ్‌ను ప్రశ్నించారు. దానికి బదులిస్తూ, తాను అధికారిక సమాచార చట్టాన్ని పాటించానన్నారు. ప్రతిదీ అందుబాటులో ఉండేలా చూసుకున్నాను, తనకు అవసరమైన ప్రతిదాన్ని తన పార్లమెంటరీ ఈ-మెయిల్ చిరునామాకు పంపించానని తెలిపారు. అంత వరకూ బాగానే ఉంది.
మరింత వివరించబోయి ఉదాహరణగా భారత దేశం నుంచే మెయిళ్ళను ప్రస్తావించారు. భారత్ నుండి ప్రజలు వలసల సలహా అడుగుతూ పంపేవి ఎక్కువగా ఉంటాయని, వాటికి తానెప్పుడూ స్పందించనని అన్నారు. అంతటితో ఆగక వాటిని తాను దాదాపుగా ‘స్పామ్’తో సమానంగా చూస్తానని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం స్టాన్‌ఫోర్డ్ తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తాను వాటిని స్పామ్‌గా పరిగణించానని చెప్పలేదని ఆమె స్పష్టం చేస్తూ, వాటిని దాదాపుగా స్పామ్‌తో సమానంగా చూస్తున్నానని మాత్రమే చెప్పానని అదే మాటను మళ్ళీ చెప్పార.
ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
మంత్రి వ్యాఖ్యలపై భారత సంతతికి చెందిన కార్మిక పార్టీ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి ప్రకటన చాలా నిర్లక్ష్యంగా, అత్యంత పక్షపాతంతో కూడుకున్నదని మండిపడ్డారు.”ఈ వారం ప్రారంభంలో, ప్రైమ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వలసల శాఖ మంత్రి ఒక దేశం/జాతికి చెందిన ప్రజలను ప్రతికూలంగా చూపాల్సిన అవసరం ఉందని భావించారు. మీరు భారత్ నుండి అయితే, ఆమెకు ఈ-మెయిల్ పంపడానికి ఇబ్బంది పడకండి, ఎందుకంటే అది స్వయంచాలకంగా స్పామ్‌గా పరిగణించబడుతుంది. భారత్ & న్యూజిలాండ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రజల మధ్య సంబంధాలపై దృష్టి సారించడానికి ఇది ఎంతో ఆటంకం” అని ప్రియాంక రాధాకృష్ణన్ విమర్శించారు.
ఈ ఘటన వలసల విషయాలపై ప్రభుత్వ అధికారులు మాట్లాడేటప్పుడు సున్నితత్వం, జాతిపరమైన సాధారణీకరణల సంభావ్యత గురించి విస్తృత చర్చకు దారితీసింది. ఎరికా స్టాన్‌ఫోర్డ్ నవంబర్ 2023 నుండి న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలోని జాతీయ-సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.