March 23, 2026

143 వాగ్దానాలు ఏమయ్యాయి బాబూ…: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 

తాడేపల్లి, జూన్ 06 : ఎన్నికలకు ముందు ప్రజలకు 143 వాగ్దానాలు ఇచ్చి, వారిని మాయ చేసి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ఆయన ధ్వజమెత్తారు.

వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం (Vennupotu Dinam) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అయితే కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు.

“వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షల మంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్‌ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటానికి ఆయనకు సిగ్గులేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దళితులకు అవమానం జరుగుతోందని, గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారని తాటిపర్తి చంద్రశేఖర్ గుర్తు చేశారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోందని, హోంమంత్రి అనితకు కులం కోటాలోనే (Caste Quota) హోంమంత్రి పదవి వచ్చిందని ఆరోపించారు.

దళితులను కొడితే హోంమంత్రి కేవలం మాట్లాడుతున్నారని, టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయని, వారిని ఇలానే బజారులో కొడతారా అని నిలదీశారు. పరిటాల సునీత ఎలాకాలో దళిత బాలికపై నెలల తరబడి అత్యాచారం జరిగినా, ఈ ఘటన హోంమంత్రికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు (Law and Order) ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా అని తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా అని, రైతులను మోసం చేసింది నిజం కాదా అని మండిపడ్డారు. చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారని, మీ నాయకుడు పవన్ కళ్యాణే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నిస్తూ, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖను (Panchayat Raj Department) నిర్వీర్యం చేశారని, గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *