March 19, 2026

మధ్యప్రాచ్యంలో మండుతున్న ఇంధన క్షేత్రాలు: ప్రపంచానికి చమురు గండం!

Isreal attack on Iran

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ఇంధన క్షేత్రాలను చుట్టుముట్టాయి. ఇరాన్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు క్షేత్రం ‘సౌత్ పార్స్’పై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసిందన్న వార్తలతో పశ్చిమ ఆసియా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ దాడికి ప్రతికారంగా ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాల ఇంధన కేంద్రాలపై దాడులను ముమ్మరం చేసింది. ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించాయి. తమ ఆర్థిక మూలాలపై జరుగుతున్న ఈ దాడులు తమను టెహ్రాన్‌తో ప్రత్యక్ష యుద్ధంలోకి లాగే ప్రమాదకరమైన చర్యలని ఆ దేశాలు హెచ్చరించాయి.

ఈ యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇజ్రాయెల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను వైమానిక దాడిలో హతమార్చడం ద్వారా ఇరాన్ మతపాలన నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నామని సమర్థించుకుంటోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మరిన్ని “ఆశ్చర్యకరమైన పరిణామాలు” ఉంటాయని చేసిన వ్యాఖ్యలు ఇరాన్ నాయకత్వాన్ని మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. దీనికి స్పందనగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ, ఈ దాడులు ‘ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తగల అదుపు చేయలేని వినాశనానికి దారితీస్తాయ’ని హెచ్చరించారు.

ఇరన్ దాడి చేస్తే..మొత్తంగా భారీగా పేల్చివేస్తాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఖతార్ వంటి అమెరికా మిత్రదేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే, ప్రతీకారంగా ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌ను “మొత్తంగా భారీగా పేల్చివేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఇరాన్ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే స్థాయి హింసకు తాను అధికారం ఇవ్వదలచుకోలేదని, కేవలం రక్షణ కోసమే ఈ హెచ్చరికలని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఈ పరిణామాల నేపథ్యంలో ఖతార్ తన దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయ అధికారులను 24 గంటల్లోగా వెళ్ళిపోవాలని ఆదేశించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని హబ్షాన్ గ్యాస్ సౌకర్యం మరియు బాబ్ క్షేత్రంపై కూడా ఇరాన్ దాడులు చేయడంతో అబుదాబి అధికారులు గ్యాస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్ దేశాలు సంయమనం పాటిస్తున్నప్పటికీ, ఇప్పుడు నేరుగా తమ ఇంధన క్షేత్రాలపై దాడులు జరుగుతుండటంతో అవి కూడా సైనిక చర్యల వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

Read this article also : Iran Gass Field ‘సౌత్ పార్స్’పై ఇజ్రాయెల్ దాడి వ్యూహం.. అమెరికా పాత్రేంటి?

$108కు చేరిన క్రూడ్ ఆయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒత్తిడి పెంచడంతో చమురు ధరలు బ్యారెల్‌కు $108 దాటాయి. చమురు కొరతను అధిగమించేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెనిజులాపై ఆంక్షలను సడలించి, అక్కడి నుండి చమురు దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ ఉన్నత భద్రతా అధికారులు అలీ లారిజానీ,జనరల్ ఘోలం రెజా సోలేమానీలను హతమార్చడం ద్వారా ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీసింది. అలాగే ఇరాన్ అహం మీద మళ్ళీ దెబ్బకొట్టినట్లయ్యింది.దీంతో ఇరుపక్షాలు ఇంధన క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గండంలో పడింది.

#MiddleEastWar #IranVsIsrael #OilCrisis #Trump #Geopolitics #AndhraPulse #BreakingNews

English Summary:
The Middle East conflict has escalated to a perilous stage as Iran intensifies attacks on major energy hubs in Gulf Arab nations following reports of Israeli strikes on Iran’s South Pars gas field and the assassination of its Intelligence Minister. Nations like Qatar, Saudi Arabia, and the UAE have condemned the attacks, with Qatar ordering Iranian diplomats to leave within 24 hours. While U.S. President Donald Trump warned of “massive retaliation” if attacks on ally infrastructure continue, global oil prices have surged past $108 per barrel. The targeted destruction of energy assets threatens not only regional stability but the global economy, as the risk of a full-scale direct confrontation between Tehran and its neighbors looms large.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *