March 19, 2026

మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది..

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని జ్యోతినగర్‌లో ఆయన రోడ్ షో నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం పాత పథకాలను రద్దు చేయడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందని మండిపడ్డారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాలపై రేవంత్ సర్కార్ వేటు

కేసీఆర్ హయాంలో ప్రజలకు అండగా ఉన్న అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పేరు ఉందన్న అక్కసుతో ‘కేసీఆర్ కిట్’ వంటి అద్భుతమైన పథకాన్ని తీసేశారని, కావాలంటే పేరు మార్చుకుని పథకాన్ని కొనసాగించవచ్చు కదా అని ప్రశ్నించారు. పెన్షన్లు రూ. 4 వేలకు పెంచుతామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారని, కొత్తవి ఇవ్వడం పక్కన పెట్టి ఉన్న పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు.

మహిళలకు ఫ్రీ.. మగవారికి రెట్టింపు చార్జీలా?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో పురుషులపై భారం మోపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఫ్రీ స్కూటీలు ఇవ్వకుండా, ప్రజలను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు నిధులను ఆపడానికి ఎన్నికలకు ఏం సంబంధమని నిలదీశారు. తనపై ఉన్న కోపంతో సిరిసిల్ల జిల్లా హోదాను తీసేయాలని చూస్తున్నారని, ఇది ప్రజలపై చూపిస్తున్న కక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జ్యోతినగర్ దత్తత.. అభివృద్ధి బాధ్యత నాదే!

సిరిసిల్ల అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. జ్యోతినగర్ వార్డును తాను దత్తత తీసుకుని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఏవైనా చిన్నపాటి లోపాలు జరిగి ఉంటే క్షమించాలని, కానీ అభివృద్ధి చేసే సత్తా ఉన్న బీఆర్ఎస్‌ను ఆదరించాలని కోరారు. కారు గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీయాలని పిలుపునిచ్చారు.

#KTR #Sircilla #KCR #BRS #TelanganaElections #RevanthReddy #CongressFailures #TelanganaPolitics #MunicipalElections #Development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *