March 23, 2026

నా కొడుకు చనిపోయినప్పుడే సగం చచ్చి పోయా!.. నన్ను అవమానించి ఏం సాధిస్తారు?

 సూపర్ లీడ్: తనపై మరియు ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు, “మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలతో నన్ను ఇంతలా మానసికంగా చంపేసేకంటే, నాకింత విషమిచ్చి చంపేయండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన వ్యక్తిగత గౌరవాన్ని మరియు ఐఏఎస్ అధికారుల ప్రతిష్ఠను దిగజార్చేలా జరుగుతున్న దుష్ప్రచారంపై కన్నీటి పర్యంతమయ్యారు.

తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ మంత్రి తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. “నా కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడే నేను మానసికంగా సగం చనిపోయాను, అప్పుడే రాజకీయాలు వదిలేయాలని అనుకున్నాను కానీ నా కొడుకు పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాల కోసమే కొనసాగుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. కేవలం టీఆర్‌పీల కోసం, వ్యూస్ కోసం మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని, ఎంతో కష్టపడితే తప్ప ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాలేరని, వారి కుటుంబాలను రోడ్డుపైకి లాగి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఏ తప్పూ చేయకుండా ప్రజల మనసు గెలుచుకున్న తనపై ఇలాంటి బురదజల్లడం సరికాదని విన్నవించారు.

అధికారులు రాజకీయాలకు అతీతం

కలెక్టర్ల బదిలీలు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే ప్రక్రియ అని, అందులో మంత్రులకు కానీ, వ్యక్తిగత ప్రాధాన్యతలకు కానీ తావుండదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఒక మహిళా అధికారిపై లేనిపోని సంబంధాలను అంటగడుతూ అసభ్యకరమైన భాషలో వార్తలు ప్రసారం చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. తన ఫోన్ నంబర్‌ను 20 ఏళ్లుగా మార్చలేదని, అది అందరికీ అందుబాటులో ఉంటుందని.. కానీ దానిని కూడా వివాదాలకు వాడుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న కుట్రలను బయటపెట్టాలని డీజీపీని కోరానని, రిపోర్టు రాగానే బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *