
గత ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవీచ్యుతురాలను చేయడంతో తమ హస్తం ఉందని అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో సంబంధం ఉన్న నిషేధిత జమాత్-ఉద్-దావా (JuD) సభ్యులు కొందరు నేరుగానే మాట్లాడారు. పాకిస్తాన్‌లో వివిధ ప్రాంతాలలో జరిగిన బహరంగ సభలలో వారే వెల్లడించారు.
JuD సభ్యులు సైఫుల్లా కసూరి, మరియు ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా ప్రకటించబడిన ముజమ్మిల్ హష్మీ ఈ వాఖ్యలు చేశారు. వివిధ అంశాలపై వారు వ్యాఖ్యలు చేశారు.
1971 యుద్ధంతో ప్రతీకారం తీర్చుకున్నాం
లాహోర్ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్‌లోని అల్లాహాబాద్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి కసూరి ప్రసంగిస్తూ “నేను పుట్టినప్పుడు పాకిస్తాన్ 1971లో విచ్ఛిన్నమైంది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ‘ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఖలీజ్ (బంగాళాఖాతం)లో ముంచేశాను’ అని ప్రకటించారు. మే 10న… మేము 1971కి ప్రతీకారం తీర్చుకున్నాము,” అని పేర్కొన్నాడు.
ఆ సమయంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు మరియు భారత దళాలతో కూడిన మిత్రపక్షాల దళాలకు ఢాకాలో బేషరతుగా లొంగిపోయింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న జరిపిన మురిద్కేలోని JuD/LeT ప్రధాన కార్యాలయంపై భారత వైమానిక దాడులలో తన సహచరులలో ఒకరైన ముదస్సర్ మృతదేహం ఛిద్రమైందని కూడా అతను అంగీకరించాడు.
అతని అంత్యక్రియలకు హాజరు కావడానికి తనకు అనుమతి లేదని,ఆ రోజున తాను చాలా ఏడ్చానని కసూరి అన్నాడు, కానీ ముదస్సర్ అంత్యక్రియలకు హాజరు కావడానికి తనను ఎవరు ఆపారో వెల్లడించలేదు.
మరోవైపు, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఉన్నత సైనిక, పోలీసు మరియు పౌర బ్యూరోక్రసీ సభ్యులు కెమెరాల పూర్తి దృష్టిలో ముదస్సర్ మరియు మరో ఇద్దరు JuD సభ్యుల అంత్యక్రియలకు హాజరయ్యారు.
ప్రపంచంలో చక్కటి ప్రాచుర్యం లభించింది
“పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు తాను నా నియోజకవర్గంలో ప్రజలతో సమావేశమయ్యానని, ఈ దాడికి భారతదేశం తనను సూత్రధారిని చేసిందని, భారతదేశం తన నగరం కసూర్‌కి, ప్రపంచంలో ప్రాచుర్యం కల్పించిందని అని కసూరి వ్యంగ్యంగా అన్నాడు. తము జిహాద్ కోసం తదుపరి తరాన్ని సిద్ధం చేస్తున్నామని, తాము చనిపోవడానికి భయపడమని అతనుచెప్పాడు.
హసీనా ప్రభుత్వాన్ని కూలదోసింది మేమే
కొన్ని రోజుల క్రితం లాహోర్ సమీపంలోని గుజరాన్‌వాలాలో చేసిన తన ప్రసంగంలో, హష్మీ భారత నాయకత్వాన్ని ఉద్దేశించి, గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో మేము మిమ్మల్ని ఓడించామని పేర్కొన్నాడు. అతను విద్యార్థులు నేతృత్వంలోని భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తరువాత ఆగస్టు 5న హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని ప్రస్తావించాడు.
ఆమె భారతదేశానికి పారిపోయిందని, మూడు రోజుల తరువాత, ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారన్నారు.
JuD నాయకుల ప్రసంగాలపై స్పందిస్తూ పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ, “జిహాదీ తీవ్రవాదుల బహిరంగ ర్యాలీలలో వారి ప్రసంగాల వలన పాకిస్తాన్ ఇకపై వారికి మద్దతు ఇవ్వడం లేదు, సహించడం లేదని అధికారిక వాదనలను ప్రపంచం విశ్వసించడం కష్టతరం అవుతాయి,” అని అన్నారు.