జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదుకు ముహూర్తం ఖరారు..
జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ సభ్యత్వంలో భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ వెల్లడించారు. ఈ మేరకు నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యవేక్షణ
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల జనసేన నాయకులతో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో ఉయ్యాల ప్రవీణ్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పరిశీలకులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులును పార్టీ అధ్యక్షులు నియమించారని తెలిపారు. త్వరలోనే ఆరాణి శ్రీనివాసులు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో సభ్యత్వ ప్రక్రియను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.
సభ్యత్వం పొందితే రూ.5 లక్షల భీమా సౌకర్యం
కేవలం రూ.400 సభ్యత్వ రుసుముతో “ఉద్యమి” సభ్యత్వం పొందే వారికి పార్టీ గుర్తింపుతో పాటు భారీ భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు నేతలు వివరించారు. సభ్యత్వం ఉన్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ.5 లక్షల ప్రమాద భీమా లేదా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఇది కేవలం ప్రమాద బాధితులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వారికి ఈ ‘ఉద్యమి’ సభ్యత్వం తప్పనిసరి అని అధినేత స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు.
నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ఏర్పాట్లు
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించాలని జనసైనికులకు, వీరమహిళలకు ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సురేష్ నాయుడు, గూడూరు నుంచి తీగల చంద్రశేఖర రావు, మోహన్, అట్ల కృష్ణారావు మరియు ఇతర ముఖ్య నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Janasena #PawanKalyan #UdhyamiMembership #JanaSainiks #Sullurupeta #AndhraPradesh #JanasenaParty #Insurance

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
