
జాతీయ భద్రతపై పాక్ కుట్రలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దేశంలోని కీలక సమాచారాన్ని క్రమంగా హస్తగతం చేసుకుంటూ, ప్రజలను తమ వలలోకి లాగుతూ పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశానికి భద్రతాపరంగా సవాళ్లు విసురుతోంది. తాజాగా రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఈ మలిన కుట్రలో భాగస్వామిగా ఉన్నట్లు స్పష్టమైంది. దేశ ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ గూఢచర్య యత్నాలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామానికి చెందిన ఖాన్, గతంలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి షేల్ మహమ్మద్‌కు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేశాడు. ప్రస్తుతం అతను రాజస్థాన్ ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్నాడు.
గత ఆరు నెలల్లో పాకిస్తాన్‌కు అనేకసార్లు వెళ్లిన ఖాన్, భారత దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి అందించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. “ఆపరేషన్ సిందూర్” సమయంలో పాక్ అధికారులతో ఇతడు చర్చించినట్లు ఆధారాలు లభించాయని, ఐఎస్ఐతో అతడి సంబంధాలపై గడిచిన కొంతకాలంగా నిఘా పెట్టామని ఎస్పీ సుధీర్ చౌదరీ తెలిపారు.
అతని మొబైల్ నుంచి అనేక ఫైల్స్ తొలగించినట్లు గుర్తించామని, అతడికి చెందిన రెండు బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పాక్ రాయబార కార్యాలయంతో కూడిన సంబంధాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నది.
ఈ కేసు మరింత సంచలనంగా మారిన సంగతి ఏమిటంటే… ఖాన్ పనిచేసిన మాజీ మంత్రి షేల్ మహమ్మద్ కూడా అదే గ్రామానికి చెందినవాడు కావడం, రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పాక్ గూఢచారుల ఉచ్చులో పడి అరెస్ట్ అయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల క్రితం గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్త సహేవ్ సింగ్ గోహిల్ కూడా ఇలాగే ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేవలం మూడు రోజుల్లో 11 మంది పాక్ అనుకూల గూఢచారులను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దేశంలో విదేశీ గూఢచారుల అంతర్గత ముళ్ల వల తెరపైకి వస్తున్న వేళ… ఇటువంటి అరెస్టులు భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా ఉందని, అయితే దేశ ద్రోహ శక్తులను అంతమొందించేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నాయి.