March 23, 2026

హై ఓల్టేజ్ పోరుకు లైన్ క్లియర్.. భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠకు తెర!

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మెగా ఫైట్‌ను బహిష్కరించాలన్న గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మిత్రదేశాల విజ్ఞప్తి, సుదీర్ఘ చర్చల అనంతరం దాయాది దేశం మెగ్గి రావడంతో ఈ నెల 15న కొలంబో వేదికగా ఈ పోరు జరగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల్లో మళ్లీ జోష్ నెలకొంది.

మిత్రదేశాల విజ్ఞప్తితో మెత్తబడ్డ పాకిస్థాన్

గత కొన్ని రోజులుగా టీమిండియాతో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీటముడి వేసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక బోర్డులతో పాటు ఐసీసీ వరుసగా చర్చలు జరిపాయి. శ్రీలంక ప్రధాని అనురకుమార స్వయంగా పాక్ ప్రధాని షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. మిత్రదేశాల విజ్ఞప్తిని గౌరవిస్తూ మ్యాచ్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐసీసీ ముందు పాక్ డిమాండ్లు.. బదులిచ్చిన కౌన్సిల్

భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు పునరుద్ధరించాలని, అలాగే భారత్-పాక్-బంగ్లాదేశ్‌లతో ముక్కోణపు సిరీస్ నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనలను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్ణయం ఐసీసీ చేతుల్లో ఉండదని స్పష్టం చేసింది. అదే సమయంలో అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్‌కు ఇచ్చే దిశగా ఐసీసీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారమే కొలంబోలో సమరం

ప్రపంచకప్ మ్యాచ్‌ల బహిష్కరణ నిర్ణయం నుంచి పాక్ వెనక్కి తగ్గడంతో షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గతంలో బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం, ఆ దేశంపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించడం కూడా పాక్ నిర్ణయం మార్చుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. మొత్తానికి మైదానంలో దాయాదుల పోరు చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరబోతోంది.

#INDvsPAK #T20WorldCup #CricketNews #Colombo #IndiaVsPakistan #PCB #ICC #CricketUpdates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *