March 27, 2026

నేపాల్‌ నుంచి భారత్‌లోకి 20 డ్రోన్‌ల చొరబాటు!

భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి నేపాల్ వైపు నుంచి సుమారు 15 నుంచి 20 డ్రోన్‌లు భారత గగనతలంలోకి ప్రవేశించడంతో బీహార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గగనతలంలో 40 నిమిషాల పాటు డ్రోన్‌ల సంచారం
మధుబని జిల్లాలోని కమలా బోర్డర్ ఔట్‌పోస్ట్ (BoP) పరిధిలోని ప్రాంతాల్లో ఈ డ్రోన్‌లు దాదాపు 40 నిమిషాల పాటు సంచరించి తిరిగి నేపాల్‌లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సాయుధ సీమా బల్ (SSB) డిప్యూటీ కమాండెంట్ వివేక్ ఓఝా ఈ విషయాన్ని ధృవీకరించారు. “సోమవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో కమలా సరిహద్దు పోలీస్ ఔట్‌పోస్ట్ పరిధిలో 15-20 డ్రోన్ల వంటి పరికరాలు ఆకాశంలో కదులుతూ కనిపించాయి. అవి పడమటి నుంచి తూర్పు దిశగా కదిలి తిరిగి నేపాల్‌లోకి వెళ్లాయి” అని ఓఝా వివరించారు.

ఉన్నతాధికారులకు సమాచారం, విస్తృత తనిఖీలు
ఈ డ్రోన్‌లు తిరిగి నేపాల్‌లోకి వెళుతుండగా జానకీ నగర్ BoP వద్ద మోహరించిన SSB సిబ్బంది వాటిని గుర్తించారు. వెంటనే SSB అధికారులు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారు దర్భంగా, ఢిల్లీలోని వైమానిక దళ కేంద్రాలకు ఈ సందేశాన్ని చేరవేశారు. ఈ ఘటనతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించారు.

SSB అధికారులు నేపాల్ భద్రతా అధికారులను సంప్రదించి, సాధారణ డ్రోన్ విన్యాసాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీయగా, అలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని వారు నిరాకరించినట్లు సమాచారం. “డ్రోన్‌ల ఖచ్చితమైన స్వభావం, ఉద్దేశ్యంపై విచారణ కొనసాగుతోంది” అని డిప్యూటీ కమాండెంట్ ఓఝా తెలిపారు.

సరిహద్దుల్లో పెరిగిన నిఘా
గల్గాలియా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రాకేష్ కుమార్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు ప్రారంభించినట్లు తెలిపారు. “కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా నేపాల్ నుంచి వచ్చే ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు” అని SHO చెప్పారు. శునక దళాలు, స్కానింగ్ యంత్రాలను కూడా రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు. నేపాల్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పెట్రోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు కుమార్ పేర్కొన్నారు.

“ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి పెట్రోలింగ్ ముమ్మరం చేయబడింది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టడానికి సాధారణ దుస్తుల్లోని పోలీసులను కూడా మోహరించారు” అని ఆయన అన్నారు. నేపాల్‌తో సరిహద్దును పంచుకునే మధుబని జిల్లాలో SSB 48వ బెటాలియన్ మోహరించింది. వివేక్ ఓఝా ఈ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అకస్మాత్తుగా నేరాలు పెరిగిన దృష్ట్యా శాంతిభద్రతలను సమీక్షించేందుకు బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) పోలీసు ప్రధాన కార్యాలయంలో న్‌స్పెక్టర్ జనరల్స్ (IGs), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ (DIGs) అందరితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *