March 27, 2026

కరోనా మళ్లీ పంజా విసురుతోందా?

  • బెల్గావిలో వృద్ధుడు మృతి
  • కేరళలో కేసులు 430 దాటిన తీరు
  • ఢిల్లీలో సీఎం భరోసా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తన చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రాలవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న వేళ, కర్ణాటకలో ఓ వృద్ధుడు మృతిచెందారు. కేరళలోని పరిస్థితి మరింత ఆందోళనకరం కాగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ సీఎం రేఖా గుప్తా ప్రజలకు భరోసా ఇవ్వడంలో ముందున్నారు — “ఆందోళన అవసరం లేదు” అని స్పష్టం చేశారు.

కర్ణాటకలో బెల్గావి జిల్లాలో 70 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌తో బాధపడుతూ మృతిచెందాడు. అతనికి డయాబెటిస్‌, బీపీ, ఇస్కెమిక్‌ హార్ట్‌ డిసీజ్‌ వంటి అనారోగ్య సమస్యలతో పాటు, మతిస్థిమితం కోల్పోయే లక్షణాలు ఉండటంతో, కోవిడ్‌ కారణంగా కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌తో మరణించాడు అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అలాగే మే 17న బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 84 ఏళ్ల వృద్ధుడు మృతిచెందగా, అనంతరం అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ తేలింది. ఇది అధికారికంగా నమోదైన మరణంగా పరిగణించబడింది.

కర్ణాటకలో ప్రస్తుతం 148 యాక్టివ్‌ కేసులు ఉండగా, గురువారం ఒక్క రోజే కొత్తగా 42 కేసులు నమోదయ్యాయి.

కేరళలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఒకేసారి 430 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇది దక్షిణ భారతదేశంలో అత్యధిక సంఖ్య.

ఇక ఢిల్లీలో పరిస్థితి కొంత స్థిరంగా ఉన్నా, అప్రమత్తత అవసరమే. ఇప్పటివరకు 104 కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 మందిని ఆసుపత్రుల్లో చేర్చగా, మిగతావారు ఇంటిపట్టునే చికిత్స పొందుతున్నారు. సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ, “ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *