March 16, 2026

పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘాకు షాక్

ICC WARN TO PAK CRICKETER

ICC WARN TO PAK CRICKETER

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా ఐసీసీ క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు. విచిత్రమైన రీతిలో రనౌట్ అవ్వడం తట్టుకోలేక మైదానంలో అసహనం వ్యక్తం చేసినందుకు గాను ఐసీసీ అతడిని మందలించింది. నిబంధనల ఉల్లంఘన కింద అతడి ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సల్మాన్ ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అంపైర్లు నిర్ధారించారు.


ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సల్మాన్ ఆఘా, 39వ ఓవర్‌లో ఊహించని విధంగా అవుట్ అయ్యాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్, తన వద్దకు వచ్చిన బంతిని బౌలర్‌కు ఇవ్వబోయి క్రీజు వెలుపలికి వచ్చాడు. ఇదే అదనుగా బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ బంతిని లాక్కొని వికెట్లను గిరాటేశాడు. దీంతో థర్డ్ అంపైర్ అతడిని రనౌట్‌గా ప్రకటించగా, ఆ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైన సల్మాన్ పెవిలియన్‌కు వెళ్తూ తన గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు.

మైదానంలో క్రికెట్ పరికరాలను దురుసుగా విసిరికొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం నేరం. ఒక ఆటగాడు మైదానంలో ఆవేశానికి గురై పరికరాలను నాశనం చేయడం లేదా దురుసుగా ప్రవర్తించడం కిందకు ఇది వస్తుంది. మ్యాచ్ రిఫరీ నేమూర్ రషీద్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సల్మాన్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే సల్మాన్‌కు గతంలో ఇలాంటి రికార్డు లేకపోవడంతో కేవలం మందలింపుతో సరిపెట్టారు.

సల్మాన్ అలీ ఆఘా తన తప్పును అంగీకరించడంతో ఎటువంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే మ్యాచ్ రిఫరీ శిక్షను ఖరారు చేశారు. అతడికి ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల కాలంలో ఒక ఆటగాడికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్లు వస్తే, సదరు ఆటగాడిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20ల నిషేధం విధిస్తారు.

SalmanAliAgha #CricketNews #ICC #PAKvsBAN #RunOut #CricketDiscipline #PakistanCricket #SportsUpdate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *