
భారత రక్షణ రంగం అభివృద్ధి చెందుతున్నదా? లేక కేవలం మాటలకే పరిమితమా? “సంతకాలు చేస్తారు.. కానీ డెలివరీలు జరగవు!” అని వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ తేల్చేశారు. దేశ భద్రతను బలోపేతం చేయాల్సిన కీలక ఆయుధాల సరఫరాలో వాయిదాలు, నిర్లక్ష్యం, సమయపాలన లోపాలు వాయుసేనను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సీఐఐ (CII) వార్షిక సమావేశం వేదికగా ప్రత్యక్షంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో రావడం గమనార్హం.
సంతకాలు మాటే.. డెలివరీలు ఎక్కడ?
సంవత్సరాలుగా ఆయుధాల సరఫరాలో జాప్యమే కనిపిస్తోందని, ఒక్కటి కూడా సకాలంలో పూర్తవడం లేదని వాయుసేన చీఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తేజస్ ఎంకే1 ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఎంకే2 ప్రోటోటైప్ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. ఆమ్కా ఫైటర్ జెట్ విషయంలో కూడా నమూనా విమానం (ప్రమాణ నమూనా) అభివృద్ధి కాలేదని అన్నారు. “ఒక్క ప్రాజెక్ట్ అయినా టైమ్‌లైన్ ప్రకారం పూర్తవడం లేదు. అప్పుడు వాగ్దానాలేంటి?” అంటూ ఆయుధ తయారీ సంస్థలపైనే వేడెక్కిన ప్రశ్నలు సంధించారు.
భద్రతా దళాలు – పరిశ్రమల మధ్య విశ్వాసం అవసరం
భద్రతా రంగానికి పారదర్శకత, నిబద్ధత అత్యవసరమని, మాట ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని ఆయన గుర్తు చేశారు. “మేక్ ఇన్ ఇండియా” విషయంలో వాయుసేన పూర్తిగా అంకితభావంతో పని చేస్తోందన్నారు. రేపటి యుద్ధాలకు సిద్ధంగా ఉండాలంటే ఈరోజే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే 10 ఏళ్లలో స్వదేశీ పరిశ్రమలు ఆయుధ ఉత్పత్తిని విస్తృతంగా పెంచగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో స్పష్టత
ఇటీవల జరిగిన “ఆపరేషన్ సిందూర్” గురించి ప్రస్తావించిన ఆయన, ఇది భారత వాయుసేనకు స్పష్టత ఇచ్చిందన్నారు. “మన స్థానమేమిటి? భవిష్యత్‌కు ఏమి కావాలి?” అనే అంశాల్లో అవగాహన కలిగిందన్నారు. రాబోయే యుద్ధాలు వేగంగా మారుతున్న పరిసరాల్లో జరుగుతాయని, కొత్త టెక్నాలజీలను స్వీకరించాల్సిన అవసరం ఉందని వివరించారు.
ప్రైవేట్ రంగంపై విశ్వాసం
భారత ప్రైవేట్ రంగంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఆమ్కా ప్రాజెక్ట్‌ను ప్రైవేట్ రంగానికి అప్పగించడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇది పెద్ద మార్గదర్శక నిర్ణయంగా పేర్కొన్నారు. “ఒక్కసారి కమిట్ అయితే… నా మాట నేనే వినను” అనే సంచలన డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ఉత్సాహాన్ని నింపిన వాయుసేన చీఫ్, పరిశ్రమలు వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని, కాలపట్టికలోపల పనులను పూర్తి చేయాలని హితవు పలికారు.