
తిరుపతి, మే 29 (గురువారం): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹9 లక్షల చొప్పున జరిమానా విధించారు.
2017లో తిరుపతి డివిజన్, నాగపట్ల బీటు పరిధిలో అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా చంద్రగిరి మండలానికి చెందిన గౌస్ బాషా మరియు శివ పట్టుబడ్డారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి అటవీశాఖ కోర్డుకు సమర్పించింది. దోషులుగా నిర్ధారించబడినందున న్యాయమూర్తి గురువారం ఈ తీర్పును వెలువరించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ, ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు సిబ్బందిని అభినందించారు. శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లోని విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే నేరస్థులకు ఇది ఒక హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు.